AP Alert on Omicron: దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో.. రాష్ట్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. విమానాశ్రయాల్లో అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా విజయవాడ విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులను పరీక్షించాలని ఆదేశాలిచ్చింది. కొన్నిరోజుల ముందు వరకు కేవలం స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో విదేశీ ప్రయాణికుల్లో 2శాతం మందికి కొవిడ్ పరీక్షలు చేశారు. ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున.. విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడికీ ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తున్నారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం మీదుగా వారంలో మూడ్రోజుల పాటు మస్కట్, బహ్రెయిన్, కువైట్‌కు చాలామంది వెళ్తుంటారు. అలాగే మస్కట్, కువైట్, దుబాయ్, మలేషియా నుంచి నిత్యం ఒకటి లేదా రెండు విదేశీ సర్వీసులు వస్తుంటాయి. అలా వస్తున్న వాళ్లందరికీ విమానాశ్రయంలోనే ఆర్టీపీసీఆర్ పరీక్ష చేస్తారు. అనంతరం వారం రోజులపాటు హోమ్ ఐసోలేషన్‌లో ఉండేలా సూచనలిస్తారు. సంబంధిత వ్యక్తికి వివరాలు సమీపంలోని ఆరోగ్య కార్యకర్తకు అందించి.. వారంపాటు అతడి ఆరోగ్య పరిస్థితిపై నిఘా ఉంచేలా చర్యలు చేపట్టింది.
ప్రపంచంలో నిషేధం ఉన్న దేశాల నుంచి విజయవాడకు నేరుగా ప్రయాణికులు వచ్చేందుకు అవకాశం లేదని.. విజయవాడ విమానాశ్రయం వైద్యవిభాగ నోడల్ అధికారి సురేష్ తెలిపారు. విమానాశ్రయం మీదుగా రాకపోకలు సాగిస్తున్న గల్ఫ్ దేశాలకు సంబంధించి ఇప్పటికైతే నిషేధాజ్ఞలు లేవన్నారు. వస్తున్న వాళ్లందరికీ కచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్ష నిర్వహించి, 24 గంటల్లో రిపోర్టు వచ్చేలా చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఆదివారం కువైట్ నుంచి వచ్చిన 237 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసినట్లు చెప్పారు. పరీక్ష నిర్వహణకు ఇబ్బంది లేకుండా ఇద్దరు వైద్యాధికారులు, 15 మంది పారామెడికల్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు వివరించారు.