ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు రానున్న ఉద్యోగులను ఎక్కడ నియమించాలనే దానిపై కేసీఆర్ సర్కారు కసరత్తు చేపట్టింది. వారిని కేటాయించేందుకు వీలుగా రాష్ట్ర సచివాలయంతో పాటు శాఖాధిపతుల కార్యాలయాలు, జిల్లా కలెక్టరేట్లలో ఖాళీల వివరాలు కోరుతూ లేఖలు రాసింది. ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియలో కొంతమంది తెలంగాణ ఉద్యోగులు ఏపీకి వెళ్లారు. అప్పటి నుంచి వారు స్వరాష్ట్రానికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. రెండు ప్రభుత్వాలను కోరడంతో పాటు ఆందోళనలు చేశారు. దీనిపై ఇద్దరు ముఖ్యమంత్రులు స్పందించి చర్చించారు.
ఏపీ ప్రభుత్వం అంగీకారం
చివరకు తమ వద్ద పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను పంపడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. తాజాగా తెలంగాణ సీఎం.. ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశం సందర్భంగా ఏపీలోని ఉద్యోగులను వెంటనే రప్పిస్తామని తెలిపారు. దీనికి అనుగుణంగా ఆయన ఆదేశాలు జారీ చేయగా సీఎస్ వెంటనే ఏపీ సీఎస్‌కు లేఖ రాశారు. ఏపీ నుంచి ఉద్యోగులను పంపించడానికి మరోసారి అక్కడి ప్రభుత్వం సన్నద్ధత తెలిపింది. మొదట్లో వెయ్యి మందికి పైగా నాలుగో తరగతి ఉద్యోగులు తెలంగాణకు రావాల్సిన జాబితాలో ఉండగా వారిలో పదవీ విరమణలు పోగా ప్రస్తుతం 741 మంది మిగిలారు.