Funds Diverted: పట్టణ స్థానిక సంస్థలు చెల్లించాల్సిన విద్యుత్తు ఛార్జీల బకాయిల కోసం ఆర్థిక సంఘం నిధులు సర్దుబాటు చేసిన ప్రభుత్వం.. అవే సంస్థలకు ప్రభుత్వ శాఖలనుంచి రావాల్సిన ఆస్తి పన్ను బకాయిల ఊసెత్తడం లేదు. పాత బకాయిలతో కలిపి 2021-22లో రూ.596.73 కోట్ల ఆస్తి పన్ను ప్రభుత్వ శాఖలనుంచి రావాల్సి ఉంది. వీటిలో 2021 ఏప్రిల్‌నుంచి ఇప్పటివరకు రూ.33.09 కోట్లు వసూలయ్యాయి. ఈ నెలాఖరులోగా మరో రూ.563.64 కోట్లు వసూలుచేయాలి.
పట్టణ స్థానిక సంస్థల్లో ప్రజలకు మెరుగైన సేవల కోసం కేంద్రం ఆర్థిక సంఘం నిధులు కేటాయిస్తోంది. పుర, నగరపాలక సంస్థలు విద్యుత్తు పంపిణీ సంస్థలకు చెల్లించాల్సిన రూ.284.43 కోట్ల బకాయిల కోసం రాష్ట్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘం నిధులను మళ్లించింది. స్థానిక సంస్థల అనుమతి, ప్రమేయం లేకుండానే ప్రభుత్వ అనుమతితో ఈ నిధులను విద్యుత్తు సంస్థలు తమ ఖాతాల్లో వేసుకున్నాయి. ప్రభుత్వ శాఖలనుంచి పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన పన్ను బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి చొరవే తీసుకుంటే బాగుండేదని పలువురు అధికారులు అభిప్రాయపడుతున్నారు. పుర, నగరపాలక సంస్థల్లో ఆర్థిక ఇబ్బందులు తప్పేవని వివరిస్తున్నారు.
సగమైనా వసూళ్లు లేవు:కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వ శాఖలనుంచి పట్టణ స్థానిక సంస్థలకు రావాల్సిన పన్ను బకాయిల్లో ఏటా 50 శాతం వసూలు కూడా కష్టమవుతోంది. బడ్జెట్ ఉంటే కొన్ని శాఖలు చెల్లిస్తున్నాయి. లేనిచోట పుర అధికారులు నిబంధనల ప్రకారం నోటీసులిచ్చి చేతులు దులిపేసుకుంటున్నారు. ప్రైవేటు ఆస్తులైతే జప్తు చేస్తామని బెదిరించడం, కుళాయి కనెక్షన్లు తొలగించడం వంటివి చేసే స్థానిక సంస్థల అధికారులు.. ప్రభుత్వ శాఖల విషయంలో ఈ దూకుడు ప్రదర్శించరు. ఎవరైనా ఆ విధంగా భయపెట్టినా ఉన్నతాధికారులనుంచి ఫోన్లు వస్తుంటాయి. దీంతో ప్రభుత్వ శాఖలు ఎప్పుడు చెల్లిస్తే అప్పుడే మహాప్రసాదంలా పుర, నగరపాలక సంస్థలు స్వీకరిస్తున్నాయి.
100 డిఫాల్టర్ల జాబితాలో ప్రభుత్వశాఖలే 40:పట్టణ స్థానిక సంస్థలకు భారీగా ఆస్తి పన్ను బకాయిపడిన మొదటి వంద పేర్లలో 40 ప్రభుత్వ శాఖలే ఉన్నాయి. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ శాఖలు 31, కేంద్ర శాఖలు 9 ఉన్నాయి. ఈ సంస్థల నుంచి పుర, నగరపాలికలకు రూ.866.78 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. పన్నుల విధింపును సవాలుచేస్తూ కొన్ని కేంద్ర ప్రభుత్వ శాఖలు కోర్టులను ఆశ్రయించాయి. వీటి పరిష్కారంపైనా పట్టణ స్థానిక సంస్థలు దృష్టి సారించడం లేదు.
ఉదాహరణకు రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్‌ఐఎన్‌ఎల్) వేసిన కేసు ఏళ్లు గడుస్తున్నా పరిష్కారం కాలేదు. తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) రూ.25 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. రోడ్లు, భవనాలశాఖ రూ.3.50 కోట్లు, విశాఖ కేజీహెచ్, చెవి, ముక్కు, గొంతు ఆసుపత్రులు రూ.2 కోట్లు బకాయిపడ్డాయి. విజయవాడలోని రాష్ట్ర ప్రభుత్వ అతిథిÅగృహం (స్టేట్ గెస్ట్‌హౌస్) రూ.88 లక్షల పన్ను చెల్లించాలి.
ఇదీ చదవండి:పండుగ వేళ ఉద్యోగులకు అందని జీతాలు.. పని చేయని కొత్త సాఫ్ట్వేర్