SERP: గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్) పరిధిలోని గ్రామ సమాఖ్యలను (వీవో) పునర్వ్యవస్థీకరించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకుగాను సమాఖ్య పరిధిలోని డ్వాక్రాసంఘాలను విలీనం చేయాలని నిర్ణయించింది. ఒక్కో సమాఖ్య పరిధిలో కనీసం 30-50 వరకు సంఘాలు ఉండేలా విలీనానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నెలాఖరుకల్లా ప్రక్రియ పూర్తిచేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి బూడి ముత్యాలనాయుడు సెర్ప్‌పై నిర్వహించిన సమీక్షలో యానిమేటర్ల పరిధిలోనూ 30-50 వరకు సంఘాలుండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజా ఉత్తర్వుల్లో యానిమేటర్ల అంశాన్ని ప్రస్తావించకుండా గ్రామసమాఖ్యల పునర్వ్యవస్థీకరణను తెరమీదకు తెచ్చారు. దీంతో తమ ఉద్యోగాలకు ముప్పు వాటిల్లుతుందని యానిమేటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
30లోపు సంఘాలున్నవే అధికం..
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతంలో 28,405 గ్రామ సమాఖ్యలు ఉన్నాయి. వీటి పరిధిలో 8.60 లక్షల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 26,451, గిరిజన ప్రాంతాల్లో 1,954 సమాఖ్యలు ఉన్నాయి. ఒక్కో సమాఖ్య పరిధిలో 8-80 సంఘాలు, అపై కూడా ఉన్నాయి. మైదాన ప్రాంతాల్లో 30లోపు సంఘాలున్న సమాఖ్యలు 14,078 ఉన్నాయి. గిరిజన ప్రాంతాల్లో 30పైగా సంఘాలున్న గ్రామ సమాఖ్యలు 95 మాత్రమే ఉండగా 1,859 సమాఖ్యల్లో 1-30 లోపు సంఘాలున్నాయి. గ్రామ పంచాయతీని ప్రాతిపదికగా తీసుకుని సమాఖ్యలను పునర్వ్యవస్థీకరిస్తారు. 30లోపు ఉన్న సంఘాలను విలీనాన్ని చేస్తున్నారు.