‘తెలంగాణలో పార్టీ పెడతామని షర్మిల గతంలోనే ప్రకటించారు.. ఇప్పుడు ఏర్పాటు చేశారు. ఆమె పార్టీ ఏర్పాటు చేసిన రాష్ట్రం మనకు పొరుగు రాష్ట్రం. రాష్ట్రం విడిపోయి ఏడేళ్లవుతోంది. ఆ గాయాన్ని ఇప్పుడు మరింత పెద్దది చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు మన రాష్ట్ర ప్రయోజనాలూ ఆ రాష్ట్రంతో ముడిపడి ఉన్నందున తెలంగాణ రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండాలని సీఎం జగన్ ఆలోచిస్తున్నారు. పక్క రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు జరిపితే అవి ఏపీ ప్రయోజనాలకు భంగం కలిగించే అవకాశం ఉండవచ్చు లేదా మన రాష్ట్ర ప్రజల్లో అనుమానాలకు దారి తీయవచ్చు. అలాంటి అనుమానాలను సృష్టించే శక్తులకు ఊతం ఇచ్చినట్లవుతుందనే తెలంగాణలో ఎలాంటి రాజకీయ వ్యవహారాల్లో పాల్గొనరాదనే స్థిరమైన ఆలోచనలో జగన్ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఇడుపులపాయలో షర్మిల, జగన్ కలిస్తే.. విమర్శలు చేసేవారికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. అందువల్లే ఆమె ఇడుపులపాయకు వచ్చే సమయానికి సీఎం మరో కార్యక్రమానికి వెళ్లారు’
- రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
విశాఖ ఉక్కుతో మనకున్న భావోద్వేగాన్ని గుర్తించాలి
విశాఖ ఉక్కుతో మనకున్న భావోద్వేగాన్ని కేంద్రం గుర్తించి, చర్యలు తీసుకోవాలని సజ్జల వ్యాఖ్యానించారు. విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ దిశగా కేంద్రం మరో అడుగు వేయడంపై ఆయన స్పందించారు. ‘విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ప్రైవేటీకరించకుండా ప్రజాస్వామ్యయుతంగా చేయాల్సినవన్నీ చేస్తున్నాం. ముఖ్యమంత్రి లేఖలు రాయడం, మా ఎంపీలు వెళ్లి కలిసి కోరడం, మిగిలిన పార్టీలూ మద్దతివ్వడం, విశాఖ ఉక్కు సంఘాలు ఆందోళన ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తానికీ ప్రాతినిధ్యం వహించే అసెంబ్లీలోనే తీర్మానం చేశాం. కేంద్రం దానికి విలువ ఇవ్వాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించకుండా ప్రత్యామ్నాయం చూడాలి. కేంద్రం తీసుకోబోయే చర్యలను బట్టి రాష్ట్ర ప్రభుత్వం, అలాగే పార్టీ స్థాయిలో చర్యలు తీసుకుంటాం’ అని వివరించారు.
చరితార్థుడు వైఎస్
రాష్ట్రాన్ని అభ్యుదయ పంథాలో నడిపిన చరితార్థుడు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. అభివృద్ధి- సంక్షేమం రెండింటినీ జమిలిగా అమలు చేసిన నాయకుడని కొనియాడారు. వైఎస్ లేని లోటు తీర్చలేనిదే అయినప్పటికీ తండ్రి చూపిన మార్గంలో ముందుకు సాగుతూ ముఖ్యమంత్రి జగన్ వర్తమాన రాజకీయాల్లో సరికొత్త ఒరవడిని సృష్టిస్తున్నారని చెప్పారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో వైఎస్ జయంతి వేడుకల్లో ఆయన మాట్లాడారు. పార్టీ నేతలతో కలిసి వైఎస్ విగ్రహానికి సజ్జల పూలమాలలు వేసి నివాళులర్పించారు. మొక్కలు నాటారు. రక్తదాన కార్యక్రమం చేపట్టారు. దివ్యాంగులకు త్రిచక్ర సైకిళ్లు, పేదలకు నిత్యావసర సరకులను అందజేశారు. ఆచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి రచించిన ‘మరువలేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. కడపకు చెందిన తేజశ్రీ బాలకృష్ణ గీసిన వైఎస్ చిత్రాలతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్య వరప్రసాద్, జంగా కృష్ణమూర్తి, పార్టీ నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండీ..వైఎస్సార్ విస్తృత ప్రజాదరణ పొందిన నాయకుడు: గవర్నర్