రాష్ట్రంలో గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2019-20) బడ్జెట్ అంచనాల్లో మూడొంతులు మాత్రమే ఖర్చు సాకారమయింది. 2019-20లో రూ.2,27,975 కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ ప్రవేశపెడితే రూ.1,66,322 కోట్లు ఖర్చు చేసినట్లు లెక్కలు తేలుతున్నాయి. ఈ లెక్కలను తర్వాత సవరించే అవకాశమూ ఉంది. ఇటీవల కాలంలో బడ్జెట్ అంచనాలు, ఖర్చులకూ పొంతన లేకుండా పోతోంది. రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ తర్వాత తొలి రెండు ఆర్థిక సంవత్సరాల్లో అంచనాలకు మించి నిధులు ఖర్చు చేశారు. ఆ తర్వాత క్రమేణా అంచనాలు పెరిగిపోవడం, ఖర్చులు తగ్గడం వంటి పరిణామాలు ప్రారంభమయ్యాయి.
2017-18 నుంచి వరుసగా ఇది 93 శాతం, 86శాతానికి తగ్గిపోయి కిందటి ఆర్థిక సంవత్సరంలో మరీ తక్కువగా 73శాతానికి ఖర్చు పరిమితమయింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో సొంత ఆదాయమూ, పన్ను, పన్నేతర ఆదాయమూ, కేంద్ర సాయమూ తగ్గిపోయాయి. ఇది ఒక్క ఈ రాష్ట్రంలోనే కాదని, దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లోని ఆదాయాల్లో గణనీయమైన తగ్గుదల ఉందని ఆర్థికశాఖ అధికారులు పేర్కొంటున్నారు.