ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ ఆవిర్భావం కోసం పోరాడిన అమరజీవి పొట్టి శ్రీరాములు సహా మరెందరో సమర యోధుల త్యాగాలు స్ఫూర్తినిచ్చాయన్నారు. ఎందరో త్యాగ ధనుల స్ఫూర్తితో ఏర్పాటైన ఏపీ.... అభివృద్ధి, సంక్షేమంలో ముందుకెళ్లాలని సీఎం ఆకాంక్షించారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం జగన్... తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. ఉదయం 9 గంటలకు జాతీయ పతాకాన్ని ఎగుర వేసిన అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తారు.
కొవిడ్ మార్గదర్శకాలను అనుసరిస్తూ 9 గంటల 5 నిమిషాలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులు, జిల్లా మంత్రులు, జిల్లా కలెక్టర్లు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం స్పష్టం చేసింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొననున్నారు. దిల్లీలోని ఏపీ భవన్ లోనూ రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. ఇక 9 గంటల 15 నిమిషాలకు ముఖ్యమంత్రి జగన్ అన్ని జిల్లాల మంత్రులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సంబంధించి ప్రసంగించనున్నారు.