స్మార్ట్ సిటీస్ కింద ఇప్పటి వరకు రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన నిధుల్లో 90% ఖర్చయ్యాయి. 8 ఏళ్లలో రూ.1,873 కోట్లు విడుదలైతే రూ.1,685.14 కోట్లు ఖర్చయినట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయ మంత్రి కౌశల్ కిశోర్ తెలిపారు. గురువారం లోక్‌సభలో ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. 2015-16 నుంచి ఏటా నిధులు ఇస్తున్నట్లు వెల్లడించారు. స్మార్ట్ సిటీలుగా ప్రకటించిన అమరావతి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నంలలో రూ.7,621.95 కోట్లతో 264 ప్రాజెక్టులు పూర్తిచేయాల్సి ఉంది.
ఇప్పటివరకు రూ.1,903.09 కోట్లతో కాకినాడలో 60, తిరుపతి-35, విశాఖపట్నం-48 ప్రాజెక్టులు పూర్తయ్యాయని వెల్లడించారు. అమరావతిలో మాత్రం 21 ప్రాజెక్టులు చేపట్టాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క పనీ చేపట్టలేదని చెప్పారు. ఇక్కడ ఏ పనీ డీపీఆర్ లేదా టెండర్ దశలోనూ లేదని వెల్లడించారు.
పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు రాష్ట్రంలోనే ఎక్కువ:గత మూడేళ్లలో పర్యావరణ నిబంధనల ఉల్లంఘనలు ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధికంగా చోటుచేసుకున్నాయి. కేంద్ర పర్యావరణ, అటవీశాఖ ఆధ్వర్యంలోని పరివేష్ పోర్టల్‌లో మొత్తం 2,877 పర్యావరణ నిబంధనల ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి. అందులో 1,280 (44.90%) ఏపీకి సంబంధించినవే ఉన్నాయి. 663 (23.04%) కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. తెలంగాణకు చెందినవి 156 నమోదయ్యాయి. గురువారం రాజ్యసభలో వైకాపా ఎంపీ పరిమళ్ నత్వాని అడిగిన ప్రశ్నకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయమంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
ఏపీలో అసంఘటిత కార్మికులు 1.50 కోట్లు:ఆంధ్రప్రదేశ్‌లో అసంఘటిత కార్మికులు 1,50,92,950 మంది ఉన్నట్లు అంచనా ఉందని కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్ తేలి తెలిపారు. ఈశ్రమ్ పోర్టల్‌లో 70,50,561 మందే పేర్లు నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. రాజ్యసభలో భాజపా సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ఈశ్రమ్ పోర్టల్‌లో అత్యధికంగా అనంతపురం జిల్లా నుంచి 6,96,871 మంది నమోదైనట్లు చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాలో అత్యల్పంగా 11,050 మంది నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. ప్రధానమంత్రి శ్రమ్‌యోగి మాన్‌ధన్ యోజన కింద 13 ఉమ్మడి జిల్లాల్లో 1,61,732 మంది, చిరు వ్యాపారులకు ఇచ్చే పింఛను పథకం కింద 5,890 మంది పేర్లు నమోదు చేసుకున్నట్లు తెలిపారు.