ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

తెలంగాణ 'భారీ నీటి మళ్లింపు'ను ఆపండి.. కృష్ణా బోర్డుకు ఏపీ లేఖ

కృష్ణా నీటిని తెలంగాణ విపరీతంగా వాడేస్తోందంటూ.. రాష్ట్ర ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల నుంచి చిన్ననీటి వనరులకు మళ్లిస్తున్నట్లు పేర్కొంది. 89.15 టీఎంసీల కేటాయింపులు మాత్రమే ఉండగా.. 175.54 టీఎంసీలు మళ్లిస్తున్న తెలంగాణను నిలువరించమంటూ లేఖ రాసింది.

state engineer in chief letter to Krishna river management board
రాష్ట్ర ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ

By

Published : Jul 7, 2021, 6:09 AM IST

Updated : Jul 7, 2021, 6:21 AM IST

కృష్ణా ట్రైబ్యునల్‌ అవార్డు, కేటాయింపులకు విరుద్ధంగా తెలంగాణ రాష్ట్రం నీటిని వినియోగిస్తోందంటూ.. నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నారాయణరెడ్డి లేఖ రాశారు. కృష్ణా పరివాహకంలో 16వేల163 చిన్ననీటి చెరువుల పునరుద్ధరణ, 352 కొత్త చెక్‌డ్యాంల నిర్మాణం, 24 కొత్త చెరువుల నిర్మాణంతో నీటి నిల్వను పునరుద్ధరించేందుకు సిద్ధమైందని లేఖలో పేర్కొన్నారు. అలాగే మరింత నీటిని నిల్వ చేసేలా 6 వేల 243 కోట్లతో పనులు చేపట్టేందుకు జీవో 474 ఇచ్చిందని వివరించారు.

ఈ రకంగా తనకున్న 89.15 టీఎంసీలను మించిన నీటిని తెలంగాణ వాడుకుంటోందని.. బచావత్‌ అవార్డుకు పూర్తి విరుద్ధమని గుర్తుచేశారు. బచావత్‌ అవార్డు ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చిన్ననీటి వనరుల కింద ఏడాదికి 116.26 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని.. ఇందులో తెలంగాణకు 90.833 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 25.441 టీఎంసీలు వాటా వచ్చినట్లు తెలిపారు. 1976-77 మధ్య కాలంలో కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మధ్య కుదిరిన ఒప్పందాల ప్రకారం.. చెన్నై నగరం తాగునీటి అవసరాలకు మూడు రాష్ట్రాలు తలో 5 టీఎంసీలు సరఫరా చేయాల్సి ఉందన్నారు. ఈమేరకు చిన్ననీటి వనరుల కేటాయింపులో నుంచి 5 టీఎంసీలను చెన్నైకి బదలాయించారని.. అందుకనుగుణంగా చిన్ననీటి వనరుల కేటాయింపులు 111.26 టీఎంసీలకు తగ్గిపోయాయని లేఖలో ప్రస్తావించారు.

రాష్ట్ర విభజన తర్వాత చెనైకి ఇవ్వాల్సిన 5 టీఎంసీలను 2:1 నిష్పత్తిలో పంచగా.. చిన్ననీటి వనరుల వాటా తెలంగాణకు 89.15 టీఎంసీలు, ఏపీకి 22.11 టీఎంసీలకు తగ్గిపోయినట్లు ఈఎన్‌సీ నారాయణరెడ్డి చెప్పారు. మిషన్‌ కాకతీయ పేరుతో చేపట్టిన చిన్ననీటి వనరులకు భారీ సాగునీటి ప్రాజెక్టుల నుంచి నీటిని మళ్లిస్తున్నట్లు.. కృష్ణా ట్రైబ్యునల్‌-2 ముందు 2016లో తెలంగాణ దాఖలుచేసిన నివేదికలో స్పష్టంగా పేర్కొందన్నారు. వర్షాలు సరిగా లేకపోవడంతో అనేక దశాబ్దాలుగా తమ వాటాలోని 89.15 టీఎంసీల నీటిని తెలంగాణ పొందలేకపోతోందన్నారు. దీనివల్ల జూరాల, నాగార్జునసాగర్, కల్వకుర్తి, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకం), నెట్టెంపాడు నుంచి చిన్ననీటి వనరులకు నీటిని మళ్లిస్తున్నట్లు తెలిపారు. కృష్ణా మొదటి ట్రైబ్యునల్‌కు సమర్పించిన వివరాల ప్రకారం తెలంగాణలో మొత్తం సాగు విస్తీర్ణం 5 లక్షల 57వేల 14 ఎకరాలు ఉండగా... మొదటి, రెండు పంటలకు 90.833 టీఎంసీలు వినియోగించారన్నారు. ప్రస్తుతం తెలంగాణ సాగు విస్తీర్ణం 10 లక్షల 77వేల 34 ఎకరాలకు చేరిందని.. ఈ లెక్కన మొదటి, రెండు పంటల కోసం చిన్ననీటి వనరుల కింద 175.54 టీఎంసీలు వినియోగిస్తున్నట్లు స్పష్టమవుతోందన్నారు. జీవో 474లో పేర్కొనని చిన్ననీటి చెరువులను లెక్కలోకి తీసుకుంటే.. తెలంగాణ నీటి వినియోగం 175.54 టీఎంసీలకు మించిపోతుందన్నారు.

కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి రాష్ట్ర ఈఎన్‌సీ నారాయణరెడ్డి లేఖ
Last Updated : Jul 7, 2021, 6:21 AM IST

ABOUT THE AUTHOR

...view details