ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికలన్నీ ఒకేసారి: పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం - state election commission

స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది. దీనిపై ఇవాళ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒకేసారి నిర్వహించాలంటే అదనపు పోలింగ్‌ సిబ్బంది, పోలీసు బందోబస్తు అవసరమవుతాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఎన్నికల కమిషనర్​ గురువారం లేఖ రాశారు. పోలింగ్‌కు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

state election officers trying to one time poll in local body
ఎన్నికలన్నీ ఒకేసారి: పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

By

Published : Mar 6, 2020, 8:11 AM IST

ఎన్నికలన్నీ ఒకేసారి: పరిశీలిస్తున్న రాష్ట్ర ఎన్నికల సంఘం

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ పరిశీలిస్తోంది. పోలింగ్‌కు ఇబ్బంది లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తే ఒకేసారి ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి వచ్చే సమాధానంతోపాటు రాజకీయ పార్టీల ప్రతినిధులతో శుక్రవారం నిర్వహించే సమావేశంలో వ్యక్తమయ్యే అభిప్రాయాల మేరకు ఎన్నికల కమిషన్‌ తదుపరి నిర్ణయం తీసుకోనుంది.

14వ ఆర్థిక సంఘం నిధులు చేజారిపోకుండా ఉండాలంటే అన్నింటికీ ఒకేసారి ఎన్నికలు చేపట్టి ఈనెల 27లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరింది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి, పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు, కమిషనర్లు గిరిజా శంకర్‌, విజయ కుమార్‌, శాంతి భద్రతల అదనపు డైరెక్టర్‌ జనరల్‌ రవిశంకర్‌ అయ్యన్నార్‌, డీఐజీ రాజశేఖర్‌బాబు శుక్రవారం ఎన్నికల కమిషనరు రమేశ్‌ కుమార్‌తో సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రతిపాదనపై వారి అభిప్రాయాలను ఎన్నికల కమిషనరు అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్‌ సరేనంటే అన్ని ఏర్పాట్లు చేయడానికి సిద్ధంగా ఉన్నామని పంచాయతీరాజ్‌, పురపాలక, హోంశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఎన్నికలు ఏయే తేదీల్లో నిర్వహించాలన్న అంశంపైనా సమగ్ర చర్చ జరిగింది. ప్రజలకు, పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాల్సి ఉందని ఎన్నికల కమిషనరు వ్యాఖ్యానించారని తెలిసింది. వివిధ తేదీల్లో ఒకేసారి ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం తరఫున తగిన భరోసా అవసరమని, ఇందుకోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాస్తున్నామని రమేశ్‌ కుమార్‌ వివరించారు.

నేడు నిర్ణయం

స్థానిక సంస్థలకు ఎన్నికలు ఏ విధంగా నిర్వహించాలన్న అంశంపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులతో ఎన్నికల కమిషనరు మధ్యాహ్నం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి వారందరి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. గుర్తింపు పొందిన, ఎన్నికల సంఘంలో నమోదైన రాజకీయ పార్టీల ప్రతినిధులతోనూ సాయంత్రం సమావేశమై అభిప్రాయాలను తెలుసుకుంటారు. ఈలోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి సమాధానం వస్తుందని భావిస్తున్నారు. వీటన్నింటినీ విశ్లేషించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని ఎన్నికల కమిషన్‌ అధికారులు తెలిపారు.

ఇలా ఉండొచ్చు..?

1) ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను ఒకే దశలో నిర్వహిస్తారు. పోలింగ్‌ పూర్తయిన 2రోజుల తర్వాత ఓట్ల లెక్కింపు.

2) పురపాలక ఎన్నికలనూ ఒకే దశలో నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఉగాది తరువాత చేపట్టనున్నారు.

3) ఎంపీటీసీ, జడ్పీటీసీ, పురపాలక ఎన్నికల పోలింగ్‌కు, ఓట్ల లెక్కింపునకు మధ్యలో ఉన్న విరామ రోజుల్లో గ్రామ పంచాయతీల్లో మొదటి దశ ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండో దశలో మిగతా పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

5) జడ్పీ ఛైర్‌పర్సన్‌, వైస్‌ ఛైర్‌పర్సన్‌, మండల పరిషత్తు అధ్యక్ష, ఉపాధ్యక్షులు, పురపాలక ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌, నగరపాలక మేయరు, ఉప మేయరు ఎన్నికలను ఈ నెల 30, 31 తేదీల్లో నిర్వహిస్తారు.

సవాలుగా తీసుకుని పూర్తి చేస్తాం...

ఈ ఎన్నికలను సవాలుగా తీసుకుని పూర్తి చేసేలా ప్రత్యేక కార్యాచరణను సిద్ధం చేస్తున్నాం. అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించాక ఏ విధంగా నిర్వహించాలనే విషయమై నిర్ణయం తీసుకుంటాం. ఎన్నికల ప్రకటన వెలువడ్డాక నిబంధనావళి అమలులోకి వస్తుంది. ప్రశాంత వాతావరణంలో ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకునేలా తగు చర్యలు తీసుకుంటున్నాం. పోలింగ్‌ కేంద్రాలు, సిబ్బంది ఎంపిక, శిక్షణ తదితర ప్రక్రియ కొనసాగుతోంది. అదనపు పోలీసు బలగాలను ఇతర రాష్ట్రాల నుంచి రప్పించేందుకు హోంశాఖ సిద్ధంగా ఉంది. వాలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సేవల వినియోగంపై అవసరాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. -రమేశ్‌ కుమార్‌, రాష్ట్ర ఎన్నికల కమిషనరు

ఇదీ చదవండీ... నేడు రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం

ABOUT THE AUTHOR

...view details