రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయసువారికి ఉచిత టీకాల పంపిణీ కోసం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, ఉత్పత్తి సంస్థల మధ్య సంప్రదింపులు కొనసాగుతున్నాయి. వారు తీసుకునే నిర్ణయాలనుబట్టి రాష్ట్రానికి వచ్చే వ్యాక్సిన్‌కు అనుగుణంగా ఈ వయోవిభాగంలోని వారికి టీకాలను వేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతరం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భారత్ బయోటెక్ (కొవాగ్జిన్), సీరం (కొవిషీల్డ్) సంస్థలకు లేఖలు రాసింది. రాష్ట్రంలో 18-44 ఏళ్ల మధ్య వయసువారు 2.04 కోట్ల మంది ఉన్నారని, వారికి రెండు డోసుల చొప్పున ఇచ్చేందుకు 4.08 కోట్ల డోసులు అవసరమని లేఖలలో పేర్కొంది. స్పుత్నిక్ టీకా కోసం డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్‌కు కూడా లేఖ రాసింది. వీటిల్లో ఇప్పటికే రెండు సంస్థలు సానుకూలంగా స్పందించి ప్రభుత్వంతో చర్చిస్తున్నాయి. ఓ సంస్థ కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా చెల్లించాలని కూడా కోరినట్లు తెలిసింది. ధర నిర్ధారించాక నిధుల కేటాయింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపాలి. ఈ ప్రక్రియ అనంతరం ఉత్పత్తి సంస్థలకు వైద్య ఆరోగ్య శాఖ మరో లేఖ పంపాలి. దీనికనుగుణంగా ఉత్పత్తి సంస్థలు దశలవారీగా ఎంత వ్యాక్సిన్ పంపుతాయనే అంశంపై స్పష్టత వస్తుంది. ఉత్పత్తి సంస్థల నుంచి కొంతవరకైనా వ్యాక్సిన్ సరాసరి రాష్ట్రానికి వస్తే 18-44 ఏళ్ల మధ్య వయసువారికి టీకాలను వేయాలని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. ఈ విభాగంలోని లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో టీకాలను కొంటోంది. దీనివల్ల టీకా సరఫరాపై కేంద్రానికి రాష్ట్రం జవాబు చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇదే క్రమంలో కేంద్ర ప్రభుత్వ కొవిన్ యాప్‌లో వివరాల నమోదుపై కంగారు పడక్కర్లేదని వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి.
నిల్వలొస్తే 3,4 నెలల్లోనే టీకా పూర్తి!
ఉత్పత్తి సంస్థల నుంచి రాష్ట్రానికి ఇప్పటికిప్పుడు ఎంత వ్యాక్సిన్ రావచ్చన్న దానిపై కచ్చితమైన సమాధానం లేదు. క్రమం తప్పకుండా వ్యాక్సిన్ వస్తే మాత్రం ఉన్న మౌలిక సదుపాయాలు, కేంద్రాలను అనుసరించి కనీసం 3, 4 నెలల్లో 18-44 ఏళ్ల మధ్య వయసువారికి రెండు దశల్లోనూ టీకాలను వేసే వీలుంది. సచివాలయాల ద్వారా ఒకే రోజు 6లక్షల మందికి టీకా వేసిన అనుభవాన్నిబట్టి తగినన్ని నిల్వలు వస్తే త్వరలో వేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.