జాతీయ, అంతర్జాతీయ పర్యటకులను ఆకర్షించేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానంలో నక్షత్ర హోటళ్లు, రిసార్టుల ఏర్పాటుకు సర్కారు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. మొత్తం 6 జిల్లాల్లోని పర్యటకశాఖ భూముల్లో వీటి నిర్మాణానికి సన్నాహాలు చేస్తోంది. త్వరలో మఖ్యమంత్రి జగన్‌తో సమావేశమై... టెండరు ప్రక్రియ చేపట్టాలని పర్యటక శాఖ భావిస్తోంది.
రాష్ట్రంలో పర్యటకులు ఎక్కువగా సందర్శిస్తున్న జిల్లాల్లో చిత్తూరు, విశాఖ తొలి 2 స్థానాల్లో ఉన్నాయి. పర్యటకులను ఆకర్షించేందుకు... వారికి సౌలభ్యంగా ఉండేలా నక్షత్ర హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు పర్యటక శాఖ సిద్ధమవుతోంది. ఇందుకోసం పలు జిల్లాల్లో 769 ఎకరాల భూమిని సమీకరించింది.
ప్రైవేట్ సంస్థలకు 33 ఏళ్ల పాటు లీజుకు ఇస్తూ... నక్షత్ర హోటళ్లు, రిసార్ట్‌లు ఏర్పాటు చేసుకునేలా అవకాశం కల్పించబోతోంది. విధివిధానాలను నెలాఖరులోగా ఖరారు చేయనుంది. నిపుణులు, ఉన్నతాధికారులతో ఇటీవల నిర్వహించిన సమావేశం అనంతరం... పర్యటక శాఖ కొన్ని ప్రతిపాదనలు రూపొందించింది. హోటళ్లు, రిసార్టుల నిర్మాణం కోసం టెండర్లు ఆహ్వానిస్తోంది.