ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సకల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే త్వరలో ఆస్తులు, భూముల మార్కెట్ విలువలను పెంచనుంది. ఇందుకు పరిగణనలోనికి తీసుకోవాల్సిన అంశాల కోసం అవకాశమున్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తోంది. సహజంగా కొత్త వెంచర్లు, లే అవుట్ల అనుమతులు ఎక్కడ అధికంగా ఉన్నాయనే వివరాలను సేకరిస్తారు. ఈసారి గతానికి భిన్నంగా విద్యుత్తు బిల్లుల చెల్లింపు మొత్తాలను పరిశీలిస్తుండటం గమనార్హం. అంటే.... ఏదైనా ప్రాంతంలో కరెంటు బిల్లుల చెల్లింపులు సాధారణం కంటే అధికంగా ఉంటే అక్కడ ఆస్తుల విలువను సైతం పెంచుతారన్నమాట. వీటితోపాటు స్థిరాస్తి వ్యాపారులు... భూములు, ఇళ్ల స్థలాలు, ఇళ్లకు సంబంధించి ఇచ్చే బహిరంగ ప్రకటనలు, ముద్రించే కరపత్రాల సంఖ్యనూ పరిశీలిస్తున్నారు. ఏఏ ప్రాంతాల్లో వీటి జోరు అధికంగా ఉందనే వివరాలను సేకరిస్తున్నారు. వాణిజ్య సముదాయాల ఇంటి నంబర్ల వారీగా వాటి ప్రాధాన్యాన్ని గుర్తించాలని కూడా జిల్లా అధికారులను ఆదేశించారు. అలాగే... వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా మార్పిడి చేసిన వాటి వివరాలను తెలుసుకుంటున్నారు. యథావిధిగా ఆయా ప్రాంతాల అభివృద్ధిని సైతం పరిగణనలోనికి తీసుకుంటున్నారు. ఈ ఏడాది మార్చి 30తో ప్రస్తుతమున్న మార్కెట్ విలువలు ముగుస్తున్నాయి. ఏప్రిల్ 1 నుంచి వాటిని పెంచేందుకు వీలుగా మార్కెట్, కట్టడాల (స్ట్రక్చర్చ్) ప్రస్తుత విలువలను సవరించేందుకు సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వయిజరీ కమిటీ ఆమోదించింది. దీని ప్రకారమే చర్యలు తీసుకోవాలని, అయితే... అమలు తేదీని తర్వాత ప్రకటిస్తామని పేర్కొంటూ స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ జిల్లాలకు తాజాగా ఆదేశాలు పంపించింది.
అభ్యంతరాల పరిశీలనకు ఒకే రోజు
జిల్లాల్లోని కమిటీలు కొత్తగా ప్రతిపాదించే మార్కెట్ విలువలను ఈ నెల 25న బహిర్గతం చేస్తారు. వాటిపై మార్చి 3 వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించేందుకు ఒకరోజు సమయం మాత్రమే కేటాయించారు. మార్చి 7న కొత్త మార్కెట్ విలువలను ఖరారు చేస్తారు. ప్రభుత్వం ప్రకటించే తేదీ నుంచి వీటిని అమలు చేస్తారు.