తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ నెల 22న రికార్డు స్థాయిలో వరద వచ్చింది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు.. 6 గంటల్లోనే 9 టీఎంసీల నీరు చేరింది. దీంతో ప్రాజెక్టు నుంచి ఏకంగా 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వదలాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. జూన్ 1న ప్రాజెక్టులో కేవలం 18 టీఎంసీల నీరు ఉండగా.. జులై 1 నాటికి అది 27 టీఎంసీలకు చేరింది. జులై 16న ఒక్కరోజే 10 టీఎంసీల నీరు రాగా.. 21న సైతం 10 టీఎంసీలు చేరింది. ఇక జులై 22న ప్రాజెక్టు పూర్తిగా నిండిపోగా.. ఆ రోజు మధ్యాహ్నం గేట్లు ఎత్తి శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు మొత్తం 45.3 టీఎంసీలు దిగువకు వదిలారు.
ఎస్సారెస్పీ చరిత్రలో రెండో అత్యధిక ఔట్ ఫ్లో ఈ ఏడాది రికార్డైంది. 1983లో 9 లక్షల క్యూసెక్కులు వదలగా.. ఈ నెల 22న 6 లక్షల క్యూసెక్కులు విడుదల చేశారు. జులై నెలలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఈ స్థాయిలో వరద రావడం తక్కువ సందర్భాల్లో జరిగింది. ఈ ఏడాది జులైలో శుక్రవారం సాయంత్రం 5 గంటల వరకు 98.5 టీఎంసీలు ప్రాజెక్టులో చేరితే.. అదే సమయానికి 45.3 టీఎంసీలు దిగువకు వదిలారు. 1989 జులైలో అత్యధికంగా 250 టీఎంసీల నీరు రాగా.. 199 టీఎంసీల నీటిని విడుదల చేశారు.