ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇలా అయితే ఎలా పదిలం?.. నిపుణుల నివేదికలే తప్ప ముందుకు సాగని శ్రీశైలం పనులు

Srisailam project : తెలుగు రాష్ట్రాలకూ కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు... భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. డ్యాం భద్రతపరంగా అనేక పనులు చేయాల్సి ఉన్నా అడుగు ముందుకు పడటం లేదు. నిపుణుల కమిటీలు సిఫార్సులు చేస్తున్నా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. 60ఏళ్ల క్రితం నిర్మించిన డ్యాంలో ప్రస్తుతం పరికరాలు పాతపడిపోయాయి. యుద్ధప్రాతిపదికన వీటిని ఆధునీకరించాల్సి ఉన్నా స్పందన లేదు. పనుల ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి స్వయంగా ఖర్చు చేయాల్సి ఉన్నా చేయట్లేదు. కోటి రూపాయల బిల్లును నెలల తరబడి పెండింగులో పెట్టడంతో ఈ ప్రాజెక్టులో చిన్న పనులకూ గుత్తేదారులు రావట్లేదు.

srisailm dam
శ్రీశైలం ప్రాజెక్టు

By

Published : Sep 14, 2022, 7:40 AM IST

శ్రీశైలం ప్రాజెక్టు

Srisailam project : రెండు తెలుగు రాష్ట్రాలకూ కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టు అనేక ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. డ్యాం భద్రతపరంగా అనేక పనులు చేయాల్సి ఉన్నా అడుగు ముందుకు పడటం లేదు. నిపుణుల కమిటీలు సిఫార్సులు చేస్తున్నా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు. ఒకవైపు డ్రిప్‌ (డ్యాం రీహాబిలిటేషన్‌ అండ్‌ ఇంప్రూవ్‌మెంట్‌ ప్రోగ్రాం) కింద నిధులు తెచ్చే ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. పనుల ప్రాధాన్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కొన్నింటికి స్వయంగా ఖర్చు చేయాల్సి ఉన్నా చేయట్లేదు. రూ.కోటి బిల్లును నెలల తరబడి పెండింగులో పెట్టడంతో ఈ ప్రాజెక్టులో చిన్న పనులకూ గుత్తేదారులు రావట్లేదు. మరోవైపు చాలినంత మంది సిబ్బందీ ప్రాజెక్టులో లేరు.

చిన్న పనులూ ఎక్కడివక్కడే..

..

శ్రీశైలం ప్రాజెక్టులో గ్యాలరీలో పైపులైను పనులకు రూ.40 లక్షలతో టెండర్లు పిలిచారు. గ్యాలరీలో కింది నుంచి పైకి నీరు పోయేలా అవసరమైన పైపులైను ఏర్పాటు చేయాలి. ఈ పని చేసేందుకు ఒక్క గుత్తేదారూ ఆసక్తి చూపడం లేదు. ఇప్పటివరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు.

..

20 మంది జేఈలకు ముగ్గురే: శ్రీశైలం ప్రాజెక్టులో 20 మంది జూనియర్‌ ఇంజినీరు పోస్టులు ఉన్నాయి. ప్రస్తుతం కేవలం ముగ్గురు జేఈలే ఉన్నారు. పది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్లు ఉండాలి. వారు కూడా ముగ్గురే ఉన్నారు. ఎన్‌ఎంఆర్‌ ఉద్యోగులు, వర్కుఛార్జ్‌డ్‌ సిబ్బంది కొరత కూడా ఉంది.

నిధులిచ్చేవారు లేక:శ్రీశైలంలో స్పిల్‌ వే దిగువన ప్లంజ్‌పూల్‌ (పెద్ద గొయ్యి) ఏర్పడింది. ఇది స్పిల్‌ వే వైపు విస్తరిస్తోంది. దీన్ని కాంక్రీటుతో పూడ్చేందుకు రూ.700 కోట్లతో అధికారులు ప్రతిపాదనలను సిద్ధం చేశారు. ఈ పనితోపాటు దీనిపై మరిన్ని అధ్యయనాలు అత్యవసరంగా జరగాలని డ్యాం భద్రతా కమిటీ సూచించింది. స్పిల్‌ వే వైపు ఆ గొయ్యి విస్తరించకుండా చర్యలు తీసుకోవాలి. మరోవైపు ఏప్రాన్‌ భద్రత పనులూ చేపట్టాలి. శ్రీశైలం కుడిగట్టున రక్షణ పనులు చేయాలి. అప్రోచ్‌ రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి. ఈ ప్రాజెక్టు సమీపంలో ఉన్న కొండవాలు ప్రాంతాల్లో రక్షణ చర్యలు చేపట్టాలి. రేడియల్‌ గేట్లకు ఎప్పటి నుంచో పెయింటింగ్‌ లేదు. గర్డర్లను పరిశీలించి అవసరమైన పనులు చేయాలని భద్రతా కమిటీ సూచించింది. ప్లంజ్‌ పూల్‌ సమస్యతోపాటు అనేక ఇతర పనులకు రూ.790 కోట్లతో డ్రిప్‌ కింద ప్రతిపాదనలు పంపినా వాటన్నింటికీ అనుమతులు దక్కలేదు. డ్రిప్‌లో 70% నిధులు కేంద్రం నుంచి వస్తాయి. 30% రాష్ట్రం భరించాలి. తాజాగా రూ.108 కోట్లతో 9 పనులు చేపట్టేందుకు డ్రిప్‌ కింద శ్రీశైలం అధికారులు ప్రతిపాదనలు పంపారు.

* శ్రీశైలం నిర్మాణం నాటి నుంచి ఉన్న కేబుల్‌ వైరు పునరుద్ధరణకు, పాత పరికరాలను మార్చేందుకు రూ.40 లక్షలతో మరికొన్ని పనులను ప్రతిపాదించారు. 7 సార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ఆసక్తి చూపడం లేదు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బిల్లులు సకాలంలో చెల్లించకపోవడం వల్ల కీలకమైన పనులకూ ఇబ్బందులు వస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.

* శ్రీశైలం ప్రాజెక్టులో ఒక స్టాప్‌ లాగ్‌ గేటుకు సంబంధించిన ఎలిమెంట్లను స్పిల్‌ వే వంతెనపైనే ఉంచేశారు. వీటిని డిజైన్ల ప్రకారం రూపొందించి డాకింగ్‌లో ఉంచాలి. సాధారణ గేట్లు దెబ్బతిన్నప్పుడు వాటిస్థానంలో.. నీటిప్రవాహాన్ని ఆపడానికి స్టాప్‌లాగ్‌ గేట్లను ఉపయోగిస్తారు. రివర్‌ స్లూయిస్‌ గేట్లు, ఈ స్టాప్‌ లాగ్‌ గేట్ల పనులను గుత్తేదారు కొంత చేశారు. ఆ పనులకు రూ.1.25 కోట్ల వరకు గత ఆర్థిక సంవత్సరంలోనే ఇవ్వాల్సి ఉన్నా ఇంతవరకు చెల్లించలేదు. దీంతో గుత్తేదారు ఆ పనులు మధ్యలోనే ఆపేశారు. స్టాప్‌ లాగ్‌ గేటు ఎలిమెంట్లు డాకింగ్‌కు చేర్చకుండా అక్కడే ఉంచేసిన దృశ్యమూ కనిపిస్తోంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details