Sriramanavami Celebrations in Bhadrachalam: భద్రాద్రి శ్రీసీతారాముల వారి ఆలయంలో వైభవోపేతంగా సాగుతున్న తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రధాన ఘట్టం ఆవిష్కృతం కానుంది. జగదేక వీరుడు జానకిరాముడు అతిలోక సుందరి సీతమ్మకు జరిగే కమనీయమైన పెళ్లి వేడుక కోసం మిథిలా ప్రాంగణం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. లోక కల్యాణంగా భావించే కమనీయమైన కల్యాణ మహోత్సవానికి భద్రాద్రి ఆలయ అధికార యంత్రాంగం సకల ఏర్పాట్లు చేసింది. కల్యాణ ఘట్టానికి సంబంధించిన పూజలు కల్యాణ మండపంలో ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరుగనున్నాయి. ఇందుకోసం మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కల్యాణ మండపాన్ని అలంకరింపజేశారు. అభిజిత్ లగ్నంలో కల్యాణం జరగనుంది. తొలుత తిరు కల్యాణానికి సంకల్పం పలికి సర్వ విజ్ఞాన శాంతికి ఆరాధన చేపట్టనున్నారు.
రాములోరి కల్యాణం ఇలా..: కల్యాణానికి ఉపయోగించే సామగ్రిని సంప్రోక్షణ చేసిన తర్వాత..రక్షా బంధనం నిర్వహించి యోక్త్రధారణ చేస్తారు.ఇందులో యోక్త్రధారణ రమనీయంగా ఉంటుంది. దర్బలతో ప్రత్యేకంగా అల్లిన తాడుని సీతమ్మవారి నడుముకి బిగిస్తారు. సీతారాములకు రక్షాబంధనం కడతారు. స్వామి గృహస్త ధర్మం కోసం యజ్ఞోపవీతధారణ చేస్తారు. తాంబూలాది సత్కారాలు చేసి కన్యావరుణ నిర్వహించి.. తాంబూలాది సత్కారాలు చేస్తారు. శ్రీరాముడికి సీతమ్మ తగిన వధువని పెద్దలు నిర్ణయిస్తారు. ఇరు వంశాల గోత్రాలను పఠిస్తారు. స్వామివారి పాద ప్రక్షాళన చేసి మహాదానాలు సమర్పిస్తారు. వధూవరులకు మంగళం చేకూర్చాలనే భావనతో అందించే ఈ ఆశీస్సులు కల్యాణం వీక్షించే భక్తులందరికీ వర్తించేలా ఉంటాయి. కల్యాణ వైభవాన్ని చాటిచెప్పేలా చూర్ణికను పఠిస్తారు. వేద మంత్రోచ్ఛరణలు మారుమోగుతుండగా.. అభిజిత్ లగ్నం సమీపించగానే జీలకర్ర బెల్లం మిశ్రమాన్ని సీతారాముల శిరస్సుపై ఉంచే సమయాన్ని శుభ ముహూర్తమని జగత్ కల్యాణ శుభ సన్నివేశంగా కీర్తిస్తారు.