తెలంగాణ నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలోని పోచంపాడ్ వద్ద గల శ్రీరాంసాగర్ జలాశయంలో జలహోరు కనిపిస్తోంది. భారీగా చేరిన నీటితోప్రాజెక్టు కళకళలాడుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా.. ప్రస్తుతం 1085.60అడుగులుగా ఉంది. అలాగే పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 90టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 68.7టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత మూడు రోజులుగా లక్ష క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండటంతో అధిక మొత్తంలో ప్రాజెక్టులో నీరు చేరింది. మహారాష్ట్రలోని ప్రాజెక్టులు నిండటం.. దిగువకు గోదావరి నీటిని వదలడంతో భారీగా ప్రవాహం ఎస్ఆర్ఎస్పీకి చేరింది. అలాగే ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోనూ భారీగా వర్షాలు కురవడంతో అధిక ప్రవాహం నెలకొంది.
జూన్ 20న కేవలం 24 టీఎంసీలే..
ఈనెల ప్రారంభంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో కేవలం 29టీఎంసీల నీరు నిల్వ ఉంది. జూన్ 20న కేవలం 24టీఎంసీల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉంది. జూన్ నెలాఖరున కురిసిన వర్షాలతో ప్రాజెక్టులో నీటిమట్టం ఈనెల 8నాటికి 30టీఎంసీలకు చేరింది. ఆ తర్వాత జులై మొదటి వారంలో మహారాష్ట్రలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో మహారాష్ట్రలో ఉన్న బాబ్లీ, బాలేగావ్, విష్ణుపురి ప్రాజెక్టు పూర్తిగా నిండాయి. దీంతో ప్రాజెక్టుల గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. విష్ణుపురి ప్రాజెక్టు నుంచి అధిక ప్రవాహం ఎస్ఆర్ఎస్పీకి చేరింది. ఈనెల 8న ప్రాజెక్టులోకి కేవలం ఐదు వేల క్యూసెక్కుల ప్రవాహం ఉండగా.. ఆరోజు రాత్రికి 20వేలకు చేరింది. ఆ తర్వాత రెండు రోజులూ అదే స్థాయిలో నీరు ప్రాజెక్టులోకి వచ్చింది.
70 టీఎంసీలకు చేరువైన నీటి నిల్వ..
ఈనెల 11న ప్రవాహం కాస్త తగ్గినా.. అదే రోజు రాత్రి ఎగువన ఉన్న విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో మళ్లీ ప్రవాహం పెరిగింది. దీంతో ఒక్కసారిగా ప్రవాహం 60వేలకు పైగా వచ్చింది. ఆరోజు సాయంత్రం వరకు దాదాపు 90వేల క్యూసెక్కులకు పైగా నీరు శ్రీరాంసాగర్కు చేరింది. దీంతో నీటి నిల్వ సైతం 40టీఎంసీలు దాటింది. ఆ తర్వాత జిల్లాలోనూ వరుసగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవడంతో మరో లక్ష క్యూసెక్కుల ప్రవాహం దాటింది. ఈనెల 14న విష్ణుపురి నుంచి ఏకంగా లక్ష క్యుసెక్కుల నీరు దిగువకు వదిలారు. గత నాలుగు రోజులుగా పరివాహకంలో కురిసిన భారీ వర్షాలతో నిన్న ఉదయం ఏకంగా 1.83లక్షల క్యూసెక్కల నీరు వచ్చింది. ఈనెల 16ఉదయం వరకు ఇదే ప్రవాహం ఉండటంతో ప్రాజెక్టు నీటి నిల్వ 70టీఎంసీలకు చేరువైంది.