ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

return from Afghanistan: అఫ్గానిస్థాన్‌ - శ్రీకాకుళం జర్నీ - ap returning from Afghanistan

అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు ఆ దేశాన్ని వారి అధీనంలోకి తెచ్చుకోవడంతో అక్కడి ప్రజలు, విదేశీయులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారు. ఎప్పుడేం జరుగుతుందోననే భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఉన్న విదేశీయులు సైతం బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఇలాంటి తరుణంలో అక్కడ భారత రాయబార కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది స్వదేశానికి వచ్చేందుకు నానా అవస్థలు పడ్డారు. ఇందులో ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌(ఐటీబీపీ) దళంలో పనిచేస్తున్న సిక్కోలు వాసులు ముగ్గురున్నారు. మందస మండలానికి చెందిన సీనియర్‌ కమాండెంట్‌ పి.రాజశేఖర్‌, నందిగాం నుంచి నక్కా మన్మథరావు, కంచిలికి చెందిన దొడ్డ వినోద్‌ కుమార్‌ సురక్షితంగా దేశ రాజధాని దిల్లీకి చేరుకున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ నిబంధనల ప్రకారం 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉన్నారు. అక్కడి నుంచి మన దేశానికి చెందిన అధికారుల తరలింపు సమయంలో వారు అనుభవించిన నరకయాతన, ఆందోళన వారి మాటల్లోనే..

returning from Afghanistan
returning from Afghanistan

By

Published : Aug 21, 2021, 9:47 AM IST

Updated : Aug 21, 2021, 10:05 AM IST

అఫ్గానిస్థాన్‌ నుంచి తిరిగొచ్చిన శ్రీకాకుళం జిల్లా వాసుల మనోగతం.. అక్కడి నుంచి మన దేశానికి చెందిన అధికారుల తరలింపు సమయంలో వారు అనుభవించిన నరకయాతన, ఆందోళన వారి మాటల్లోనే..

రోడ్లన్నీ నిండిపోయాయి...

రాత్రంతా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని నిరీక్షించిన తర్వాత ఎట్టకేలకు 16న తెల్లవారుజామున విమానం వచ్చింది. అందులోకి మన అధికారుల్ని ఎక్కించాం. సాధారణ విమానాలన్నీ రద్దు కావడంతో అక్కడి నుంచి బయటపడటానికి స్థానికులు ఎన్నో ప్రయత్నాలు చేశారు. కనిపించిన అన్ని సైనిక విమానాల్ని చుట్టుముట్టారు. ఆ సమయంలోనే అమెరికా రక్షణ దళాలు కాల్పులు జరిపాయి. ఇంతలో మన విమానం వచ్చింది. స్థానికులెవరూ విమానం దగ్గరికి రాకుండా రక్షణ వలయంలా ఏర్పాటై అడ్డుకున్నాం. అన్నీ సర్దుకున్నాయని, విమానం బయలుదేరడానికి సిద్ధంగా ఉందని ఆ కమాండెంట్‌ నుంచి ఆదేశాలు వచ్చిన ఒక్క నిమిషంలో మెరుపు వేగంతో అంతా లోపలికి వెళ్లిపోయాం. ఆ వెంటనే విమానం టేకాఫ్‌ అయింది. అధికారులు, మేము అందరం సురక్షితంగా భారత్‌కి చేరుకున్నాం.

ప్రస్తుతం అందరూ ఇక్కడి కొవిడ్‌ నిబంధనల ప్రకారం క్వారంటైన్‌లో ఉన్నారు. అది పూర్తి కాగానే స్వగ్రామానికి వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం. మేమంతా క్షేమంగా ఉన్నాం. త్వరలోనే జిల్లాకు వస్తాం.

ఒక్క నిమిషంలో లోపలికి...

రెండేళ్లుగా అఫ్గానిస్థాన్‌లోని కాబూల్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయంలో డిప్యూటేషన్‌పై పని చేస్తున్నాం. మేమంతా ఐటీబీపీ విభాగానికి చెందిన వాళ్లం. తాలిబన్లు దేశాన్ని క్రమంగా వారి అధీనంలోకి తీసుకుంటున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అప్పటికే కాబూల్‌ సరిహద్దుల్లోకి చొరబడిపోయారు. అధ్యక్షుడు దేశాన్ని వదిలి వెళ్లిపోయిన తర్వాత పరిస్థితులు మరింత దిగజారిపోయాయి. ఇక తప్పని పరిస్థితుల్లో విదేశాంగ ప్రతినిధులను స్వదేశానికి తీసుకురావాలని భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వారికి ఎలాంటి హానీ జరగకుండా కాపాడడమే మా విధి నిర్వహణలో ప్రధానమైంది. ప్రాణాలకు తెగించైనా వారిని కాపాడాల్సిందే. రాయబార కార్యాలయం నుంచి ఎయిర్‌బేస్‌కి వెళ్లే మార్గమధ్యలో రోడ్లు ఎక్కడా ఖాళీ లేవు. రోడ్లన్నీ స్థానిక ప్రజలతో నిండిపోయాయి. ఎంతోమంది వాహనాలు ఆపండి.. మమ్మల్ని కూడా తీసుకెళ్లండంటూ పెద్దగా కేకలు పెట్టారు. అదీ అక్కడి పరిస్థితి. మొత్తానికి తిరిగి తిరిగి ఎయిర్‌బేస్‌కి చేరుకున్నాం.

ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేం....

ఆగస్టు 14న రాత్రి భోజనం చేశాం. ఆ తర్వాత ఆగస్టు 16 మధ్యాహ్నం స్వదేశంలో ఆహారం తీసుకున్నాం. అప్పటివరకూ ఖాళీ కడుపుతోనే ఉండాల్సి వచ్చింది. తిందామన్నా, తాగుదామన్నా ఎక్కడా ఏమీ దొరకని దుస్థితి నెలకొంది. అయినా విధి నిర్వహణలో వెనుకడుగు వేయడానికి వీల్లేదు. ఎయిర్‌బేస్‌లోకి ప్రజలు చొచ్చుకొస్తుండటంతో తప్పని పరిస్థితుల్లో అమెరికా దళాలు కాల్పులు ప్రారంభించాయి. చాలాసేపు భీతావహ వాతావరణం నెలకొంది. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకలేదు. ఆ క్షణాలు జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేం. అధికారుల్ని మాత్రం ఒక్క క్షణం కూడా వదలకుండా కాపాడుకున్నాం. అదొక్కటే మా లక్ష్యంగా భావించాం.

ఇదీ చదవండి: ys viveka murder case : వివేకా హత్య కేసు..సమాచారం ఇస్తే రివార్డు..సీబీఐ ప్రకటన

Last Updated : Aug 21, 2021, 10:05 AM IST

ABOUT THE AUTHOR

...view details