ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SRB scheme canceled in APS RTC మా సొమ్ము ఆర్టీసీకి ఎందుకు - పదవి విరమణపై ఉద్యోగుల ఆందోళన

SRB scheme canceled in APS RTC ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యాక ఉద్యోగి పదవీ విరమణ ప్రయోజన పథకాన్ని (ఎస్‌ఆర్‌బీఎస్‌) రద్దు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. 8శాతం వడ్డీతో ఉద్యోగులకు సెటిల్‌మెంట్‌ చేస్తోంది. అయినా యాజమాన్యం వద్ద ఇంకా రూ.120 కోట్లు మిగులుతాయని ఉద్యోగ వర్గాలు ఆందోళన చేస్తున్నాయి.

APS RTC
ఆర్టీసీ

By

Published : Aug 30, 2022, 10:00 AM IST

SRB scheme canceled in APS RTC ఎస్‌ఆర్‌బీఎస్‌ని కొనసాగించాలని ఉద్యోగులంతా డిమాండ్‌ చేస్తున్నప్పటికీ, యాజమాన్యం మాత్రం అందులో ఉన్న మొత్తాన్ని పంచేయడంపైనే శ్రద్ధ చూపుతోంది. ఇందులోనూ మొత్తం సొమ్ము ఇవ్వకుండా రూ.120 కోట్ల వరకు మిగుల్చుకోవాలని యాజమాన్యం చూస్తోందంటూ ఉద్యోగ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మా సొమ్ము ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నిస్తున్నారు. 1989లో ప్రారంభమైన ఎస్‌ఆర్‌బీఎస్‌ కోసం ఉద్యోగి నెలకు రూ.40 చొప్పున చెల్లించేవారు. తర్వాత అది రూ.250కి చేరింది. ఆర్టీసీ కూడా తన వాటాగా గతంలో ఏటా రూ.3 కోట్లు, 2015 నుంచి 2019 మధ్య ఏటా రూ.6కోట్ల చొప్పున కేటాయించేది. ఈ మొత్తం రూ.400 కోట్ల వరకు చేరింది. ఈ పథకం కింద పదవీ విరమణ తర్వాత ఉద్యోగికి నెలనెలా గరిష్ఠంగా రూ.3వేల వరకు నెలవారీ నగదు ప్రయోజనం (ఎంసీబీ) అందుతోంది. ప్రస్తుతం దాదాపు 35వేల మంది విశ్రాంత ఉద్యోగులు ఈ ప్రయోజనాన్ని పొందుతున్నారు. 2020 జనవరినుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమయ్యారు. అప్పటివరకు 45వేల మంది సర్వీసులో ఉన్న ఉద్యోగులు కంట్రిబ్యూషన్‌ చెల్లిస్తుండటంతో వారందరికీ ఈ పథకంలో ఉన్న మొత్తాన్ని పంచుతున్నారు.

సొమ్మంతా ఇవ్వడం లేదు..

2019 డిసెంబరునాటికి రిటైర్‌ అయిన 35వేల మంది ఉద్యోగులకు ప్రతినెలా మొత్తంగా రూ.6 కోట్ల వరకు చెల్లించేవారు. విలీనం తర్వాత రిటైర్డ్‌ ఆర్టీసీ ఉద్యోగుల వాటా కింద ఉన్న మొత్తాన్ని రెండేళ్లపాటు ఎంసీబీగా ఇస్తే సరిపోతుందని అధికారుల కమిటీ నిర్ణయించింది. వారికి 2020 జనవరినుంచి 2021 డిసెంబరు వరకు 24నెలలపాటు దాదాపు రూ.145 కోట్లు ఎంసీబీని ఈ పథకం నుంచే ఇచ్చారు. ఈ ఏడాది జనవరినుంచి ఎంసీబీని ఆర్టీసీ యాజమాన్యం ఇవ్వాల్సి ఉంది. మరోవైపు దీన్ని సర్వీసులో ఉన్న 45వేల మందికి 8శాతం వడ్డీతో సెటిల్‌ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. 2024 జనవరినుంచి పదవీ విరమణ పొందనున్నవారికి క్రమంగా చెల్లించేస్తున్నారు. ఇలా అందరు ఉద్యోగులకు అయిదారేళ్లలోగా సెటిల్‌ చేసే అవకాశముందని తెలుస్తోంది. ఇదంతా లెక్కించినా మొత్తం రూ.280 కోట్లు అవుతుంది. అంటే ఇంకా రూ.120 కోట్లు మిగిలిపోతోంది. దాన్ని ఆర్టీసీ యాజమాన్యం మిగుల్చుకుంటోందనే వాదన వినిపిస్తోంది.

ఎక్కువ వడ్డీతో ఎందుకివ్వరు?

ఉద్యోగులకు 8శాతం కాకుండా 12-15 శాతం వడ్డీతో సెటిల్‌ చేస్తే, దీని ఖాతాలోని సొమ్మంతా అందరికీ అందుతుందనే వాదన వినిపిస్తోంది. అయితే 2020కి ముందు రిటైరైన వారికి ప్రతినెలా ఎంసీబీ ఇవ్వాల్సి ఉన్నందున మిగిలిన మొత్తం అందుకు వినియోగిస్తామని అధికారులు చెబుతున్నారు. రిటైరైన వారికి ఈ ఏడాదినుంచి ఆర్టీసీయే చెల్లింపులు చేయాలని కార్యదర్శుల కమిటీలో స్పష్టంగా చెప్పినప్పటికీ, సర్వీసులో ఉన్న ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ మొత్తం నుంచి ఎలా ఇస్తారని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ఆర్టీసీ ఉద్యోగులు పీటీడీలో విలీనమైనన్పటికీ ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి పాత పింఛనుగానీ, సీపీఎస్‌గానీ ఖరారు కాలేదు. వృద్ధాప్యంలో కుటుంబానికి భరోసా నింపే పథకాన్ని రద్దు చేయొద్దని ఎస్‌ఆర్‌బీఎస్‌ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీలో ఉన్న ఎక్కువమంది కోరినప్పటికీ నిష్ఫలమైంది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details