ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Diwali Festival: దీపావళి విశిష్టత ఏంటి..? దీపాలు ఎక్కడ వెలిగించాలి? - diwali festival story

దీపావళి (Diwali Festival) అంటేనే వెలుగుల పండుగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే.. అంబరాన్నంటే సంబరాలే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకొనే ఈ దీపావళి విశిష్టత ఏమిటి? ఈ వేడుక ఎన్ని రోజులు? దీపాలు ఎక్కడ వెలిగించాలి? ఆ రోజున తలస్నానం ఆచరించడం వల్ల కలిగే ఫలితమేంటి? తదితర అనేక ఆసక్తికర అంశాలను మందపల్లి, అన్నవరం దేవస్థానం పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు. ఆయన మాటల్లోనే..

diwali festival
దీపావళి

By

Published : Nov 4, 2021, 6:29 AM IST

ఆశ్వీయుజ త్రయోదశి, చతుర్దశి, అమావాస్య.. ఈ మూడు రోజులకు అత్యంత ప్రాధాన్యం ఉంది. సనాతన ధర్మంలో అశ్వీయుజ మాస కృష్ణపక్ష త్రయోదశి మొదలు మూడు రోజుల్లో ప్రదోష సమయాన (సాయంకాలం వేళ) దీపాలను ఇంటి వద్ద, ఆలయాల వద్ద, గోశాల వద్ద వెలిగించడం లక్ష్మీప్రదం. అలాగే, భాద్రపదంలో మొదలయ్యే పితృదేవతారాధనకు ఈ దీపావళితో దీపాల ద్వారా వీడ్కోలు పలకడం జరుగుతుంది. నరక చతుర్దశి రోజు సూర్యుడు తుల రాశిలో, చంద్రుడు స్వాతి నక్షత్రంలో.. రవిచంద్రులిద్దరూ తుల రాశిలోనే ఉండటం జ్యోతిషశాస్త్రం ప్రకారం అత్యంత విశేషమైనది. దీపావళి రోజు ఎవరైతే తెల్లవారు జామున తలస్నానం ఆచరిస్తారో వాళ్లకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. తులరాశిలో సూర్యుడు సంచరించే సమయంలో నదుల్లోని నీటిలో శక్తి దాగి ఉంటుందనీ.. ఆ నదీ ప్రవాహంలో గానీ, సముద్రంలో గానీ తలస్నానమాచరించిన వారికి ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొంటోంది. అందువల్ల నరక చతుర్దశి / దీపావళి రోజున తలస్నానమాచరించడం సనాతనంగా వస్తున్న ధర్మం.

చీకటి నుంచి వెలుగు వైపు..

చీకటి అజ్ఞానానికి, నిరాశకు ప్రతీక. కాంతి.. ఆనందానికి సూచిక. దీపం ఐశ్వర్యం.. అంధకారం దారిద్య్రం. అజ్ఞానమనే చీకటి నుంచి విజ్ఞానమనే వెలుగులోకి పయనింపజేయడమే దీపావళి పండుగ ఉద్దేశం. దీపం ఉన్న చోట జ్ఞాన సంపద ఉన్నదని.. దీపం సాక్షాత్తు లక్ష్మీదేవి అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. దీపం జ్ఞానానికి, త్రిమూర్తులకు ప్రతీక. అందుకే సనాతన ధర్మంలో ప్రతీ శుభకార్యంలో దీపాన్ని వెలిగిస్తారు. పురాణాల ప్రకారం.. దీపావళితో నరకాసుర సంహార గాథ, బలి చక్రవర్తి రాజ్య దానం, విక్రమార్కుని పట్టాభిషేకం ముడిపడి ఉన్నాయి. ఆశ్వీయుజ చతుర్దశి రోజు నరకాసురుడిని శ్రీకృష్ణుడు సత్యభామాసమేతుడై సంహరించడం వల్ల దీపావళి ఏర్పడిందని పురాణాలు చెబుతున్నాయి. బలి చక్రవర్తి మహా విష్ణువుకు రాజ్యదానం చేసిందీ ఈ సమయంలోనే. అలాగే, విక్రమార్కుడికి పట్టాభిషేకం జరిగిన సమయం కూడా ఇదేనని పురాణాలు పేర్కొంటున్నాయి.

దీపావళి ఐదు రోజుల పండుగ..

శాస్త్ర ప్రకారంగా చూస్తే.. దీపావళి (Diwali Festival) ఐదు రోజుల పండుగ. ఆశ్వయుజ కృష్ణ త్రయోదశి/ధన త్రయోదశి మొదటి రోజు. నరకాసురుడి సంహారం జరిగిన నరక చతుర్థశి రెండో రోజు. ఆశ్వీయుజ అమావాస్య దీపావళి మూడోరోజు. బలి చక్రవర్తి పాతాళంలోకి ప్రవేశించిన రోజు బలి పాడ్యమి నాలుగో రోజు. అలాగే, కార్తీక శుక్ల ద్వితీయ /యమ ద్వితీయ రోజు యమ ధర్మరాజుని ప్రార్థిస్తారు. ఈ రోజు భగినీ హస్త విదియ. రామాయణం ప్రకారం.. రామభరతుని యొక్క సమాగమం దీపావళితో ముడిపడి ఉంది. రావణ సంహారం అనంతరం రాముడు అయోధ్యకు చేరి భరతుడిని కలిసిందీ దీపావళి రోజే అని పురాణాలు పేర్కొంటున్నాయి. దీన్నే ఉత్తరాదిలో భరత్‌మిలాప్‌గా జరుపుకొంటారు. అభ్యంగన స్నానం, దీపారాధన, ఇంటి ఇలవేల్పు పూజ, లక్ష్మీపూజ. దీపావళి రోజు సాయంత్రం పూట లక్ష్మీ ఆరాధన తప్పనిసరిగా చేయాలి. సనాతన ధర్మంలో దీపావళి అమావాస్య రోజంటే... రామాయణంలో రాముడు అయోధ్యకు వచ్చిన రోజు, పాల కడలి నుంచి లక్ష్మీదేవి ఉద్భవించిన రోజు, మహాభారతంలో నరకాసురుడిని వధించిన రోజు, పాండవులు అజ్ఞాతవాసం ముగించుకొని రాజ్యానికి తిరిగి వచ్చిన రోజు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details