విజో... ఈ పదాన్ని ఇంతవరకు పెద్దగా వినిఉండరు. తేజస్వినీరంగారావు మనదేశం నుంచి మొదటి మహిళా విజోగా మారిన తర్వాత మాత్రం అందరికీ సుపరిచితం అవుతోంది. ఇంతకీ విజో అంటే ఏంటనేగా మీ సందేహం. సుఖోయ్ వంటి యుద్ధవిమానాలు చేసే యుద్ధవిన్యాసాలని నిర్వహించేందుకు పైలట్లు కాకుండా ప్రత్యేకంగా వెపన్ సిస్టమ్ అధికారులు ఉంటారు. వాళ్లనే విజో అంటారు.
మనోధైర్యంతో యుద్ధ తంత్రం
అత్యంత మనోధైర్యంతో... ఆకాశం నుంచే యుద్ధతంత్రాలు రచించడం వీళ్లపని. ప్రతిష్ఠాత్మక సుఖోయ్-30ఫ్లీట్ విమానాలకు విజోగా బాధ్యతలు అందుకుంది తేజస్విని. ఆమె స్వస్థలం చెన్నై. తండ్రి రంగారావు. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చీఫ్ మేనేజరుగా విధులు నిర్వర్తించేవారు. తల్లి రాధిక గృహిణి. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వీరిలో తేజస్విని చిన్నమ్మాయి. పాఠశాల చదువంతా చెన్నైలో పూర్తి చేసుకున్న తేజస్వినికి చిన్నప్పట్నుంచీ భారతరక్షణ విభాగంలో చేరి దేశానికి సేవలందించాలనే కోరిక ఉండేది. ప్రోత్సాహం అందిస్తే అమ్మాయిలు ఏమైనా సాధిస్తారని నమ్మిన తేజస్విని తల్లిదండ్రులు పుట్టిపెరిగిన చెన్నైని వదలడానికి కూడా సిద్ధమయ్యారు. తమ కుమార్తె అనుకున్నది సాధించగలదనే నమ్మకం ఈ దంపతులకు ఉంది. అందుకే పిల్లల చదువుల కోసం బెంగళూరుకు వచ్చారు.
రక్షణ రంగంలో పని చేయాలన్న ఉక్కు సంకల్పం
తేజస్విని అక్కడే బీఎస్సీ బయోటెక్నాలజీ, జెనిటిక్స్, కెమిస్ట్రీలో డిగ్రీ పూర్తిచేసింది. కానీ అంతకుముందు ఎన్‌సీసీలో చేరిన అనుభవం ఆమెను నిలబడనీయలేదు. మంచి జీతం అందించే సౌకర్యవంతమైన ఉద్యోగం కన్నా... అనునిత్యం సవాళ్లకు ఎదురొడ్డి పోరాడే యోధురాలిగానే ఉండాలనుకుంది. పనిచేస్తే భారతరక్షణ రంగంలోనే పనిచేయాలనే ఆమె కోరిక అంత బలంగా మారడానికి కారణం ఎన్‌సీసీ అందించిన అనుభవమే. అలా తన లక్ష్యాన్ని సాధించడం కోసం తేజస్విని నావిగేషన్ ట్రైనింగ్ స్కూల్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరాలనుకుంది. ప్రవేశపరీక్ష రాసి అర్హత సాధించింది. ఏడాదిపాటు ఉండే ఈ కోర్సుని విజయవంతంగా పూర్తి చేసింది.