ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Teachers Day 2022: ప్రథమ నమస్కారం గురువుకే ఎందుకో తెలుసా?

Teachers Day 2022: దైవం, గురువు ఇద్దరూ ఒకేసారి కనపడితే ముందుగా ఎవరికి నమస్కరిస్తారని కబీర్‌ను అడిగితే- గురువుకే ప్రథమ నమస్కారం, ఆ గురువు మూలంగానే భగవంతుణ్ని దర్శించాను అంటారు. అనాదిగా భారతీయ సంస్కృతిలో గురువుకు విశిష్ట ప్రాధాన్యం ఉంది. తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలైతే, గురువును దైవానికన్నా మిన్నగా పూజిస్తాం. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. తనను తాను ఉద్ధరించుకొని ఇతరులను కూడా ఉద్ధరించగలిగినవాడు గురువు. అజ్ఞానం అనే చీకటితో మూసుకుపోయిన కళ్లను జ్ఞానం అనే వెలుగు ద్వారాలతో తెరిపించి, జ్ఞానమార్గంలో నడిపేవాడు- గురువు.

Teachers Day 2022
గురుపూజోత్సవం

By

Published : Sep 5, 2022, 12:47 PM IST

Teachers Day 2022: పరుసవేది కంటే గురువు ఘనుడు. పరుసవేది తన స్పర్శతో ఏ లోహాన్నైనా బంగారంగా మార్చగలదంటారు. అది మరొక పరుసవేదిని సృష్టించలేదు. కానీ, ఒక గురువు మరొక గురువును తయారు చేయగలడు. భార్యా పుత్ర బంధు మిత్ర ధన సంపద ఉన్నా, పూర్తి వైరాగ్యభావనలు ఉన్నా గురుపాదాలను ఆశ్రయించకపోతే నిష్ప్రయోజనం అంటారు శంకరాచార్య. గురు కటాక్షం ఉంటే సర్వం కరతలామలకమే. గురువు ఒక మాటతో, ఒక స్పర్శతో, ఒక చూపుతో గొప్ప ఆధ్యాత్మిక అనుభవాన్ని ఇచ్చి శిష్యుడి సందేహాలను పటాపంచలు చేయగలడు. రామకృష్ణ పరమహంస వివేకానందుడికి ఒక్క స్పర్శతో ఎవ్వరికీ ఇవ్వని ఆధ్యాత్మిక అనుభవాన్ని ప్రసాదించారు. దేవుడి గురించి సంశయాలను పూర్తిగా తొలగించారు.

వేదవ్యాసుడు సాక్షాత్‌ నారాయణ స్వరూపులు. వేద విభాగం చేసి, బ్రహ్మసూత్రాలను, పురాణ ఇతిహాసాలను అందించిన మహా రుషి. నేడు ఎవరు ఏది వచించినా రచించినా అది అంతా వ్యాసభగవానుడి నోటినుంచి వెలు వడినదే అనేది నానుడి. వేద విజ్ఞానం దైవాల నుంచి రుషులకు, రుషుల నుంచి మానవులకు, గురు పరంపర ద్వారా కొనసాగుతూ వస్తోంది. అందుకే, గురు పరంపరకు అభివాదం చేసి దైవప్రార్థన చేస్తాం. ప్రార్థనలో వ్యాసుణ్ని, సనాతన ధర్మాన్ని పునరుద్ధరించిన ఆదిశంకరాచార్యుణ్ని కూడా స్మరించుకుంటాం.

మనమందరం ఆరాధించే గురువులు ఒకప్పుడు శిష్యులే. ఆది శంకరాచార్యులు గోవింద భగవత్పాదుల శిష్యులు. గోవింద భగవత్పాదులు శ్రీ గౌడపాదుల శిష్యులు. జ్ఞానామృతభాండాన్ని ఒక తరం నుంచి మరొక తరానికి అందించేదే గురు పరంపర. ఆదిశంకరులు భారతదేశం నలుమూలలా తిరిగి సనాతన ధర్మాన్ని పునరుద్ధరించారు. శృంగేరి, ద్వారక, పూరి, జ్యోతిర్మఠాల్లో నాలుగు పీఠాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికీ ఆ పీఠాలు గురు పరంపరతో హిందూ ధర్మాన్ని వ్యాప్తిచేసే కేంద్రాలుగా అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్నాయి. ఈ గురు పరంపర హిందూ ధర్మంలోని ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత సంప్రదాయాలలోను, జైన, బౌద్ధ మతాలలోను కనిపిస్తుంది.

గురుశిష్య సంబంధం చాలా గొప్పది, విడదీయరానిది. గురుశిష్యులు ఆత్మ, శరీరం వంటివారు. ఒకరు వాక్కు, ఒకరు భావం. గురువే ప్రత్యక్ష దైవం అనే దృఢ నమ్మకంతో గురువును అనుసరించేవాడు శిష్యుడు. అతడికి గురుసన్నిధికి దైవసన్నిధికి మధ్య తేడా లేదు, ఉండదు. తాను సంపాదించిన జ్ఞానాన్ని గురువు అలాంటి శిష్యుల ద్వారా తరవాతి తరాలకు అందిస్తాడు. సద్గురువు తగిన శిష్యుడి కోసం తపిస్తాడు, అన్వేషిస్తాడు. రామకృష్ణ పరమహంస, వివేకానందుల గురుశిష్య సంబంధం ఈ కోవకు చెందినదే. - కస్తూరి హనుమన్నాగేంద్ర ప్రసాద్‌

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details