అతి ప్రేమ. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు తింటారులే అన్న గారాబం. పిల్లలు తొందరగా ఎదగాలన్న ఆశ. ఆరోగ్యంగా ఉండాలన్న ఆరాటం. ఇవన్నీ తల్లిదండ్రుల్లో కనిపించేవే. అవి సహజం కూడా. కానీ... మోతాదు మించటం వల్లే సమస్యలన్నీ. పిల్లలు ఏది కోరుకుంటే అది ఇవ్వాలనుకోవటం మంచిదే అయినా... ఆహారం విషయంలో ఇది శ్రుతి మించుతోంది. ఏది మంచి ఏది చెడు అన్న ఆలోచన లేకుండానే పిల్లలకు నచ్చింది పెడుతున్నారు. ఫలితంగా.. వారు వయసుకి మించి బరువు పెరుగుతున్నారు. ఈ మాత్రం బొద్దుగా ఉండకూడదా ఏమిటి..? అనుకుని మొదట్లో నిర్లక్ష్యం వహిస్తారు పెద్దలు. అదే.. క్రమంగా చిన్నారుల్లో అనేక అనారోగ్య సమస్యలకు కారణమవుతోంది. పట్టుమని పదేళ్లు నిండకుండానే.. ఊబకాయులవుతున్నారు.
- పెద్దయ్యాక సమస్యలు
శరీరంలో అవసరానికి మించి కొవ్వు చేరి ఆరోగ్యానికి హాని చేసే వ్యాధే... ఈ ఊబకాయం. తీపి పదార్థాలు, జంక్‌ఫుడ్. చిన్నారుల్లో స్థూలకాయానికి ఇవే కారణం. మోతాదుకు మించి ఆహారం తీసుకోవడం, సరైన వ్యాయామం లేకపోవడం లాంటి కారణాలతో పాటు... కొన్నిసార్లు వారసత్వం వల్ల కూడా ఈ వ్యాధి బారిన పడుతున్న చిన్నారులున్నారు. అంటే ఒక వ్యక్తి తన ఎత్తు, వయస్సుకు తగ్గట్లుగా ఉండాల్సిన బరువుకు మించితే అది అనారోగ్య సమస్యగా గుర్తించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. ఊబకాయం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, నిద్రలో సరిగా ఊపిరి తీసుకోలేకపోవడం, కీళ్లకు సంబంధించిన వ్యాధులు, కొన్ని రకాల కేన్సర్ వ్యాధులూ వచ్చే ప్రమాదముంది. అక్కడితో ఆగకుండా వారు పెద్దయ్యాక అనేక రోగాలకు కారణమవుతోందని పరిశోధనల్లో తేలింది.
- శారీరక శ్రమ లేకపోవడం
కొన్ని నివేదికలు ఇప్పటికే ఈ సమస్యపై దృష్టి సారించాలని అన్ని ప్రభుత్వాలను హెచ్చరించాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అన్ని దేశాలనూ అప్రమత్తం చేసింది. చిన్నారుల్లో ఊబకాయం సమస్య ఎక్కువగా ఉన్న భారత్‌లోనూ నిర్లక్ష్యం తగదని వారించింది. ఈ క్రమంలోనే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-ఎన్ఎఫ్హెచ్ఎస్ ఇటీవల చేసిన అధ్యయనం... దేశంలో చిన్నారుల్లో ఈ ముప్పు ఎంతగా పొంచి ఉందో తేల్చి చెప్పింది. మొత్తం 20 రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఊబకాయం అనూహ్యంగా పెరిగినట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. తగినంత శారీరక శ్రమ లేకపోవటం, అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, టీవీలు, మొబైళ్లకు అతుక్కుపోవటం ఇందుకు కారణమని విశ్లేషిస్తున్నారు. తొలిదశలో 17 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అధ్యయన ఫలితాలు వెల్లడించింది.
- అనేక వ్యాధులకు దారి తీస్తోంది
ఈ అధ్యయనంలో...పిల్లల్లో ఎత్తు, బరువుకు అనుగుణంగా ఊబకాయం ఎలా ఉందో లెక్కించారు. గతంలో చేపట్టిన సర్వేతో పోల్చితే... మహారాష్ట్ర, గుజరాత్, మిజోరం, త్రిపుర, లక్షద్వీప్ సహా జమ్ముకశ్మీర్, లద్దాఖ్‌లోనూ పిల్లల్లో ఊబకాయం అధిక శాతం పెరిగింది. నిజానికి ఈ సమస్య భారత్‌లో 4 దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తోంది. ఇదే విషయాన్ని గతంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ- డబ్ల్యూహెచ్ఓ కూడా తేల్చి చెప్పింది. ఏటా చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్య పెరుగుతూ పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. వరల్డ్ ఒబెసిటీ ఫెడరేషన్ ప్రకారం... భారత్, చైనా, అమెరికాలో మరో దశాబ్ద కాలంలో చిన్నారుల్లో ఊబకాయుల సంఖ్య ప్రమాదకర స్థాయికి చేరనుంది. అంటే... 2030 నాటికి భారత్‌లో ఈ సమస్య తీవ్రత పెరగనుంది. పెద్దవాళ్లలో కనిపించే మధుమేహం, రక్తపోటు, అధిక కొవ్వు లాంటి జబ్బులు... ఊబకాయం కారణంగా చిన్నారుల్లోనూ కనిపిస్తాయని వైద్యులు చెబుతున్నారు.
- తీవ్రమవుతోన్న ఈ సమస్య