ఏదైనా దేశం పేరు చెబితే మొదటగా మన స్మృతిపథంలో మెదిలే ఊహాచిత్రం ఆ దేశ చిత్ర పటం.. వారి జాతీయ పతాకం. అంతలా ఏ దేశానికి అయినా అదో అనివార్యం. ఆ స్వేచ్ఛ కోసం, ఆ గౌరవం కోసం ఎంతోమంది.. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల్లో ప్రాణ త్యాగాలు చేశారు చరిత్రలో. భారత జాతీయ జెండా ప్రస్థానంలోనూ ఎన్నో కీలక ఘట్టాలు ఉన్నాయి. ఈ జెండాల పుట్టుక నిన్నమొన్నటిది కాదు, అనాది నుంచీ ఉన్నదే. భారత్‌లోనూ.. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా జాతీయ పతాకానికి రూపకల్పన జరిగింది. ప్రస్తుత రూపానికి మునుపు అనేక మార్పులకు లోనైంది. అందులో పింగళి వెంకయ్య రూపొందించిన త్రివర్ణ పతాకం ప్రధానమైంది.
ఇప్పటి జాతీయ పతాకానికి మాతృక పింగళివారు రూపొందించిన త్రివర్ణ పతాకమే. 1921 లో పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ పతాకం స్వాతంత్య్రోద్యమ పోరాటంలో ముఖ్య భూమిక పోషించింది. కోట్లాది మంది ఏకతాటిపైకి తీసుకుని వచ్చి.. ఆ జెండా నీడనే పోరుబాటలో ముందుకు ఉరికారు. అప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ, ఇతరత్రా నాయకులు జాతీయ పతాకాలు రూపొందించినా.. అవి సామాన్య ప్రజల్లో ఆదరణ పొందలేదు. కానీ.. పింగళి రూపొందించిన పతాకం.. జాతీయోద్యమ పతాకంగా మారింది.
భారత ఉపఖండం బ్రిటిష్ సామ్రాజ్య వలస పాలనలోకి రావటానికి ముందు విజయనగర సామ్రాజ్యం మొదలు మొఘలుల సామ్రాజ్యం వరకు..అనేక రాజ్యాలు, సంస్థానాలుగా ఉండేది. ఆయా రాజ్యాలు, సంస్థానాలకు వేటి జాతీయ జెండా వాటికి ప్రత్యేకంగా ఉండేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ రాకతో.. ఈ సంస్థ ద్వారా భారత్‌పై బ్రిటన్ పాలన సాగేది. 1857 సిపాయిల తిరుగుబాటు నేపథ్యంలో..ఈస్ట్ ఇండియా కంపెనీని రద్దు చేసి బ్రిటన్ సామ్రాజ్యం నేరుగా భారత దేశాన్ని తన పరిపాలన పరిధిలోకి తీసుకొచ్చింది.
అప్పుడే... భారత దేశానికి మొట్టమొదటగా ఓ జాతీయ జెండా వచ్చింది. అయితే అది ఇతర బ్రిటిష్ వలస దేశాల తరహాలోనే ఉండేది. వాటిపై బ్రిటిష్ సామ్రాజ్య జెండా యూనియన్ జాక్ తప్పనిసరిగా ఉండేది. 19వ శతాబ్దం చివర్లో భారతదేశంలో స్వాతంత్య్ర కాంక్ష.. జాతీయోద్యమం ఊపందుకునే సమయంలోనే భారత జాతీయ జెండా రూపకల్పన ఆలోచనలు బలపడ్డాయి. భిన్న వర్గాల పవిత్ర సంగమమైన వైవిధ్య భారతావనికి అదే స్థాయిలో స్వతంత్ర జెండా ఎలా ఉండాలన్న అంశంపై విస్తృత మేధోమథనం మొదలైంది.