Telangana Liberation Day: తెలంగాణ విమోచన దినోత్సవం వెనకున్న చరిత్ర ఇదే!
దేశ చరిత్రలో మహోజ్వల ఘట్టం.. తెలంగాణ సాయుధ పోరాటం. రాచరికం, భూస్వామ్య వ్యవస్థ, మతోన్మాదంపై ఏకకాలంలో సాగిన ఉమ్మడి సమరమది. నిజాం నిరంకుశానికి.. భూస్వాముల అరాచకానికి, రజాకార్ల రాక్షసకాండకు వ్యతిరేకంగా జరిగిన ఉద్ధృత సాయుధ పోరాటమిది.. సామాన్యులే సాయుధులై చేసిన ప్రతిఘటన ఇది. విమోచనా.. విలీనమా.. అనే మీమాంసలు, శషభిషలు ఎన్ని ఉన్నా మొత్తంగా చరిత్రలో ఇదో విలక్షణ పోరాటం.
Telangana Liberation Day
By
Published : Sep 17, 2021, 8:47 AM IST
భూమి కోసం.. భుక్తి కోసం.. విముక్తి కోసం.. సాగిన తెలంగాణ సాయుధ పోరాటం అత్యంత విలక్షణమైంది. ఇది నిజాం నిరంకుశ పాలనకు, వెట్టి చాకిరీకి, దోపిడీకి వ్యతిరేకంగా జరిగిన సమరమే కాదు.. అణచివేతను సహించలేని ప్రజల సామూహిక తిరుగుబాటు. పీడితుల పట్ల సానుభూతితో పిడికిలి బిగించి పోరాడిన ఒక తరం చరిత్ర. బాల్యం నుంచే వేలమందిని ఉద్యమం వైపు ఆకర్షితులను చేసిన మహత్తర పోరాటం. మహిళలు సైతం కొంగు బిగించి బందూకులు పట్టిన మహోజ్వల ఘట్టం. అనేక నిర్బంధాలు, దాడులు, దౌర్జన్యాలు, చిత్రహింసలను ఎదుర్కొని.. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నిజాం రాచరికానికి, భూస్వాముల పెత్తనానికి వ్యతిరేకంగా పోరాడి ప్రపంచంలో ఎందరికో స్ఫూర్తినిచ్చిన ఉద్యమం.
సెప్టెంబరు 17.. దీని వెనుక ఎంతో ఉద్వేగం.. ఎంతో వివాదం
1948 సెప్టెంబరు 17న నిజాం నవాబుకు చెందిన సైన్యం భారత సైన్యానికి లొంగిపోయింది. దీనితో భారత్ నడిబొడ్డున ఉన్న ఒక పెద్ద సంస్థానం చరిత్ర ముగిసింది. దేశంలో జమ్మూ-కశ్మీర్, నైజాం సంస్థానాలది ప్రత్యేక చరిత్ర. ఆ రెండింటికి సరితూగే సంస్థానాలు ఆనాడు లేవు. 550 పైచిలుకు ఉన్న సంస్థానాల్లో ఆ రెండే భారత్ నాయకత్వ పటిమను పరీక్షించాయి. 1947 ఆగస్టు 15 నాటికి భారత యూనియన్‌లో చేరకుండా విపరీత తాత్సారం చేసి తీవ్ర ఉత్కంఠను, ఉద్రిక్తతను సృష్టించినవి ఈ రెండే. పాకిస్థాన్ అనుకూల శక్తులు ఒకవైపు నుంచి జమ్మూ-కశ్మీర్‌ను ముట్టడిస్తూ రావటం వల్ల ఆ సంస్థానం మహారాజు హరిసింగ్ 1947 అక్టోబర్ 27న భారత యూనియన్‌లో విలీనం చేయడానికి అంగీకరించారు. కశ్మీర్ మహారాజు లాగానే నిజాం కూడా చివరివరకూ స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నించాడు. అనివార్య పరిస్థితుల్లోనే ఇద్దరూ విలీనానికి అంగీకరించారు.
1948 సెప్టెంబరు 17కు ముందూ, వెనుక జరిగిన సంఘటనలను పరిశీలిస్తే ఇలాంటి ఎన్నో సంగతులు వెలుగులోకి వస్తాయి. ముఖ్యంగా ఈ రెండు సంస్థానాల విలీన ప్రక్రియలనూ, ఆ తర్వాతి పరిణామాలను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన ప్రముఖుల్లో వి.పి.మేనన్ ఒకరు. ఆనాటి దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖలో సంస్థానాల వ్యవహారాలు ఆయన చేతి మీదుగానే జరిగాయి. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నేత్వత్వంలో ఆయన పనిచేశారు. పదవీ విరమణ అనంతరం పటేల్ కోరిక మేరకు సంస్థానాల విలీనంపై సమగ్ర సమాచారంతో ఒక పుస్తకం రాశారు. అందులో హైదరాబాద్ సంస్థానానికి కేటాయించినన్ని పేజీలు మరే సంస్థానానికి కేటాయించలేదు. నెహ్రూ, పటేల్‌లు హైదరాబాద్ సంస్థానానికి ఇచ్చిన ప్రాధాన్యం మరే సంస్థానికి ఇవ్వలేదని చెప్పుకోవచ్చు. స్వతంత్రంగా ఉండటానికి చివరివరకూ ప్రయత్నించిన నిజాం నవాబు కారణంగా భారత సైన్యాలు చిన్నపాటి యుద్ధం చేయాల్సి వచ్చినా పటేల్ కానీ, నెహ్రూ కానీ నవాబుపై ఏ మాత్రం శత్రుత్వాన్ని ప్రదర్శించలేదు. తన సైన్యాలు లొంగిపోయాయని ప్రకటించిన తర్వాతా ఆయనతో చాలా గౌరవప్రదంగా వ్వవహరించారు. ఆయన్ను రాజప్రముఖుడిగా ప్రకటించారు. తన సొంత భూములను ప్రభుత్వపరం చేసినందుకు నష్టపరిహారంగా భారీ మొత్తాన్ని ఇచ్చారు. ఉదారంగా పెన్షన్ సైతం ఇచ్చారు. సొంత ఆస్తులను భారీగా కలిగి ఉండటానికి అనుమతిచ్చారు. నవాబుకే కాకుండా జాగీరుదార్లకు కూడా వారి వార్షికాదాయాన్ని లెక్కగట్టి సముచిత రీతిలో నష్టపరిహారం చెల్లించడం గమనార్హం.
భారత రాజ్యాంగాన్ని ఆమోదిస్తూ ఫర్మానాను సైతం నవాబు విడుదల చేశారు. భారత రాజ్యాంగం అమల్లోకి రాకముందు అంటే 1950 జనవరి 26 వరకూ నిజాం విడుదల చేసిన ఫర్మానా ఆధారంగానే హైదరాబాద్ రాష్ట్రంలో పరిపాలన సాగింది. అంతెందుకు 1949 డిసెంబరు వరకూ మేజర్ జనరల్ చౌధురి ఆధ్వర్యంలో కొనసాగిన మిలిటరీ గవర్నర్‌కు విశేష అధికారాలిచ్చే ఫర్మానాను సైతం నవాబే విడుదల చేశారు. ఆ తర్వాత ఎం.కె.వెల్లోడిని ముఖ్యమంత్రిగా నియమించటం నైజాం చేతుల మీదుగానే సాగింది. నిజానికి వీరిద్దరి హయాంలోనే హైదరాబాద్ సంస్థానం పరిపాలనా రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. పరిపాలనా యంత్రాంగాన్ని గాడిలో పెట్టారు. పోలీసు, సైన్యం, పౌర ఉద్యోగాల్లో ముస్లింలకు ఆనాడు మితిమీరిన ప్రాధాన్యం ఉండేది. కొన్ని కీలక ఉద్యోగాల్లో 75 శాతం వరకూ వారే ఉండే వారు. ఖాసింరజ్వీ నాయకత్వాన రజాకార్లు పేట్రేగడం, దీనికి సమాంతరంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన రైతాంగ సాయుధ పోరాటంతో చాలా గ్రామాల్లో పరిపాలన స్తంభించిపోయింది. ఆ అస్తవ్యస్త స్థితిని సరిదిద్దటానికి.. ముస్లింల ఆధిపత్వాన్ని పాలనా యంత్రాంగలో తగ్గించటానికి మద్రాసు, బొంబాయి రాష్ట్రాల నుంచి ఉద్యోగులను తీసుకొచ్చారు. వారి ప్రవర్తన, ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగానే ‘ఇడ్లీ సాంబార్ గోబ్యాక్’ అనే నినాదం ఆనాడు మారుమోగింది.
అసలు వివాదం ఎందుకు మొదలైంది?
భారత రాజ్యాంగ పరిషత్తులో చేరేది లేదని నవాబు 1947 జూన్ 3న ఫర్మానా విడుదలచేయటంతో హైదరాబాద్ స్టేట్ భవిష్యత్తుపై సందిగ్ధతకు బీజాలు పడ్డాయి. ఆ తర్వాత భారత్-పాక్‌ల్లో దేంట్లోనూ చేరబోరని ఆగస్టు 8న నిజాం చేసిన ప్రకటనతో తేటతెల్లమైంది. గవర్నర్ జనరల్‌గా ఉన్న మౌంట్‌బాటెన్ చాలా చెప్పిచూశారు. స్వతంత్రంగా ఉండటం అసాధ్యమని, చివరకు అన్ని అధికారాలు పోవటం ఖాయమని కూడా హెచ్చరించారు. ఫలితం కనపడలేదు. బ్రిటిష్ అధికారుల నేతృత్వంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపిద్దామని కూడా మౌంట్‌బాటెన్ ప్రతిపాదించారు. నైజాం ససేమిరా అన్నారు. సంస్థానాల్లో ప్రజాభిప్రాయ సేకరణ అన్నది ఆనాటి కాంగ్రెస్ విధానంలో ఒక భాగం. సంస్థానాల్లో భిన్న మతాలకు చెందిన ప్రజలున్న చోట దీన్ని ఇంకా బలంగా నొక్కిచెప్పారు. కశ్మీర్‌లో కూడా ప్రజాభిప్రాయ సేకరణకు అందుకే అంగీకరించారు. హైదరాబాద్‌లో ప్రతిపాదన కూడా అందులో భాగమే. సర్దార్ పటేల్ వీటన్నిటికీ అంగీకరించారు. ఏ సంస్థానానికి ఇవ్వని కొన్ని కీలక మినహాయింపులు హైదరాబాద్‌కు ఇచ్చారు. నైజాం-భారత ప్రభుత్వాల మధ్య కుదిరిన ఒప్పందం ఇందుకో ఉదాహరణ. విలీనానికి అంగీకరిస్తే బెరార్ ప్రాంతాన్ని హైదరాబాద్ సంస్థానంలో చేర్చే ప్రతిపాదనకు కూడా ఒక దశలో అంగీకరించారు. రజాకార్ల చేతుల్లో కీలుబొమ్మగా మారి యథాతథ ఒప్పందానికి తూట్లు పొడవటంతో భారత సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ముఖ్యంగా భారత్ కరెన్సీని సంస్థానంలో నిషేధించటం, ఖనిజాల ఎగుమతిపై ఆంక్షలు విధించటం, రైళ్లపై దాడులు, గ్రామాల్లో రజాకారుల దారుణాలతో పరిస్థితి విషమించింది. సెప్టెంబరు 9న సైన్యాన్ని పంపాలని నిర్ణయం తీసుకున్నారు. మూడువారాలపాటు నిజాం సైన్యాల నుంచి ప్రతిఘటన ఉంటుందని భావించారు. కానీ మూడోరోజు నుంచి ప్రతిఘటన కుప్పకూలింది. మేనన్ అంచనా ప్రకారం 800 మందికి పైగా చనిపోయారు. 108 గంటల్లోనే భారత సైన్యం అదుపులోకి పరిస్థితి వచ్చింది. మేనన్ హైదరాబాద్ వచ్చి స్వయంగా పరిస్థితిని అంచనా వేశారు.
నిజాంకు ముస్లింలలో ఉన్న పలుకుబడిని, ఒక సంస్థానంగా హైదరాబాదుకున్న ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని రాజ్యాంగ అధిపతిగా నవాబుని కొనసాగిస్తే బాగుంటుదని పటేల్‌కు మేనన్ సూచించారు. నెహ్రూను సంప్రదించిన తర్వాతే ఏ సంగతి చెబుతానని పటేల్ అన్నారు. ఆ మరుసటి రోజే నెహ్రూ అంగీకారం తెలిపినట్లు పటేల్ మేనన్‌కు చెప్పారు. కక్ష సాధింపు దృష్టితో కానీ, మతపరమైన దృష్టితో కానీ నైజాం నవాబు పట్ల నెహ్రూ-పటేల్ ద్వయం వ్యవహరించలేదు. అందుకే నైజాం ఓటమిని ఒక వీరోచిత దినంగా జరుపుకుందామని ఆనాడు భావించలేదు. రజాకార్ల దౌర్జన్యాలకు ప్రతిగా కొన్నిచోట్ల అమాయక ముస్లింలపై కూడా దాడులు జరిగాయి. దేశ విభజన సృష్టించిన రక్తచరిత్ర ఇంకా ఆరిపోని ఆనాటి నేపథ్యంలో పెద్ద పార్టీలన్నీ సామరస్యాన్నే కోరుకున్నాయి. విలీనం తర్వాత గతం తాలూకూ పాతపగలు, ఆధిపత్యాలు, వీలైనంత మేరకు స్మృతిపథం నుంచి తొలగిపోవాలన్న ఆకాంక్ష సెప్టెంబరు 17కు అధికారికంగా పెద్ద ప్రాధాన్యం ఇవ్వకుండా చేశాయి.
చరిత్రలో జరిగిన ఒక సంఘటనను తర్వాతి తరాలు మునుపటి తరాల్లాగా చూడవు. సమకాలీన అవసరాలు, అంచనాలు చరిత్ర ఘటనలను చూసే తీరుని ప్రభావితం చేస్తాయి. సెప్టెంబరు 17ను విమోచనదినంగా అధికారికంగా నిర్వహించాలన్న డిమాండ్ ఈరకంగా వచ్చిందే. అలాగే ప్రత్యేక తెలంగాణ కోరిక బలపడి, రాష్ట్రం ఏర్పాటైన తర్వాత చరిత్రలో నైజాం పాత్రపై బలమైన కొత్త వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. నూతన తెలంగాణంలో నైజాం పాత్రను కూడా నూతనంగానే చూడటం మొదలుపెట్టారు. ‘తరతరాల బూజు నిజాం రాజు’ అన్న వ్యాఖ్యలు క్రమేపీ కనుమరుగవుతున్నాయి.