కాలం మారుతున్న కొద్దీ సాంకేతికత మారుతుంది. ఈ పరిజ్ఞానాన్ని ఆసరా చేసుకుని నేరస్థులు ఎప్పటికప్పుడు పంథాలు మారుస్తున్నారు . ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్ లు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉంటున్నాయి . వాట్సప్ ,ఫేస్ బుక్‌ల్లో ఖాతాలు ఓపెన్ చేయటం.. సెల్ఫీలు దిగుతూ గంటకో ఫొటో పంపటంలాంటివి షరామామూలుగా మారాయి . చరవాణులు మనుషులకు నేస్తాలుగా మారుతున్నాయి . దీన్ని ఆసరాగా చేసుకుని సైబర్ నేరస్థులు డబ్బు సంపాదించేందుకు పథకాలు వేస్తున్నారు .
అందమైన గొంతుతో ఆకర్షిస్తారు..
వాట్సప్ ,ఫేస్ బుక్ ల్లో ముందుగా హాయ్ అని మెస్సేజ్ పంపుతారు .. నకిలీ పేర్లు,ఫొటోలతో అందమైన అమ్మాయిల్లా పరిచయం చేసుకుంటారు . కిక్కెంచే హస్కీ వాయిస్ తో మాట్లాడిస్తారు. మెల్లగా ఆకర్షిస్తూ తమ ఉచ్చులోకి లాగుతారు. తమ ప్రైవేట్ వీడియోలు చూడలంటూ కొన్ని వీడియోలు పంపుతారు . అనంతరం ప్రైవేట్ వీడియో ఛాటింగ్ కు రావాలంటూ ఒత్తిడి తెస్తారు . వీడియో ఛాటింగ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ రికార్డింగ్ చేసి ..నగదు కావాలని డిమాండ్ చేస్తారు . నగదు ఇవ్వకపోతే నగ్నంగా ఉన్న వీడియోను సామాజిక మాధ్యమాల ద్వారా ఉన్న స్నేహితులకు ,బంధువులకు పంపుతామని బెదిరిస్తారు . ఇలాంటి ఘటనలు విజయవాడ నగర పరిధిలో జరుగుతున్నాయని సైబర్ క్రైమ్ పోలీసులు చెపుతున్నారు .