ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపితేనే నియామకం - సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలపై ప్రత్యేక కథనం

కళాశాలలో చివరి ఏడాది విద్యార్థులను నేరుగా ఉద్యోగాల్లోకి తీసుకునే విధంగా సాప్ట్​వేర్​కంపెనీలు యోచిస్తున్నాయి. దీని వల్ల శిక్షణ ఖర్చులు తగ్గటమే కాకుండా సమయం ఆదా అవుతోందని భావిస్తున్నాయి. ఈ మేరకు ప్రాంగణ నియామకాల్లోనే పూర్తీ స్థాయిలో పని చేసేందుకు అనువుగా విద్యార్థులు సన్నద్ధం కావాల్సి ఉంటోంది.

campus interviews
ఇంటర్న్‌షిప్‌లో ప్రతిభ చూపితేనే నియామకం

By

Published : Apr 2, 2021, 7:51 AM IST

ఉద్యోగ నియామకాల కోసం జరిపే ప్రాంగణ ఎంపికల విషయంలో సాఫ్ట్‌వేర్‌ కంపెనీల ఆలోచన సరళి మారుతోంది. శిక్షణ, ఇతరాత్ర వ్యయాలు తగ్గించుకోవడంతోపాటు చదువు పూర్తికాగానే పూర్తిస్థాయిలో పని చేసేందుకు అనువుగా ఉండేవారు కావాలని కోరుకుంటున్నాయి. గతంలో ఇంటర్న్‌షిప్‌తో కూడిన నియామకాలు(ఐపీవో) 10% వరకు ఉండగా.. ప్రస్తుతం 60%పైగా ఇదే విధానాన్ని అనుసరిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు ఇంజినీరింగ్‌ నాలుగో ఏడాది చదివే సమయంలోనే శిక్షణను పూర్తి చేయిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేయాలనే నిబంధనను విధిస్తున్నాయి. వాటిని పూర్తి చేసిన వారినే ఎంపిక చేసుకుంటున్నాయి. కరోనాతో కళాశాలల్లో నియామకాల సందడి పూర్తిగా తగ్గింది. ఇప్పుడు అంతా వర్చువల్‌గానే మారిపోయింది. పరీక్ష నుంచి శిక్షణ వరకు అంతా ఆన్‌లైన్‌కు మారింది. ఒకవేళ కరోనా తగ్గినా ఇదే విధానాన్ని కొనసాగించాలని కంపెనీలన్నీ భావిస్తున్నాయి. ఇందులో వ్యయం తగ్గడంతోపాటు సమయం ఆదా అవుతోంది. ప్రస్తుతం నాలుగో ఏడాదిలోని విద్యార్థులకు ప్రాంగణ నియామకాల సందడి మొదలైంది. ఇప్పటికే ఇన్ఫీ టీక్యూ రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. ఏప్రిల్‌ నుంచి రిజిస్ట్రేషన్‌ల హడావుడి ప్రారంభం కానుంది. మే నెల నాటికి వర్చువల్‌ ఎంపికలు పూర్తికానున్నాయి. విద్యార్థులను వీటన్నింటికీ అనుగుణంగా తయారు చేసేందుకు కళాశాలలు భారీ కసరత్తు చేస్తున్నాయి.

ఆ ఆరునెలలు తర్వాత నచ్చితేనే..
చాలా సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నాలుగో ఏడాది ఏడో సెమిస్టర్‌ సమయంలో విద్యార్థులను ఇంటర్న్‌షిప్‌ కమ్‌ ప్లేస్‌మెంట్‌ ఆఫర్‌(ఐపీవో) విధానంలో ఎంపిక చేసుకుంటున్నాయి. ఇలా నియామకాలు పొందిన వారికి చదువు పూర్తయ్యే లోపే ఆన్‌లైన్‌, వర్చువల్‌గా శిక్షణ అందిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో పని చేసేందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌లపైనా తర్ఫీదునిస్తున్నాయి. ఈ సమయంలోనే ఉపకార వేతనాన్ని అందిస్తున్నాయి. 6 నెలల శిక్షణ తర్వాత విద్యార్థి పని తీరు నచ్చితేనే ఆ తర్వాత నియామకం చేసుకుంటున్నాయి. లేదంటే ఇంటర్న్‌షిప్‌తోనే వదులుకుంటున్నాయి.

సర్టిఫికేషన్‌ కావాల్సిందే..
ఎక్కువ ప్యాకేజీలు అందించే అమెజాన్‌, సిస్కో, పెగాలాంటి కంపెనీలు రెండో ఏడాది నుంచే సర్టిఫికేషన్‌ కోర్సులు పూర్తి చేయాలనే నిబంధన తీసుకొస్తున్నాయి. వారు సూచించిన సర్టిఫికేషన్‌ కోర్సులను పూర్తి చేసిన వారికి మాత్రమే నియామకాలు నిర్వహిస్తున్నాయి. కొన్ని కంపెనీలు ఈ కోర్సులకు రిజిస్ట్రేషన్‌కు అయ్యే వ్యయాన్ని చెల్లిస్తుండగా.. మరికొన్నింటికి విద్యార్థులు భరించాల్సి వస్తోంది.

వర్చువల్‌ మౌఖిక పరీక్ష కత్తిమీద సాము..
కరోనాతో మౌఖిక పరీక్ష వర్చువల్‌కు మారింది. గతేడాది మొదటిసారి కావడంతో కొంతమంది అభ్యర్థులు దీన్ని పూర్తి చేసేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈసారి విద్యార్థులను సన్నద్ధం చేసేందుకు కళాశాలలు ప్రత్యేక శిక్షణ ఇస్తే బాగుంటుందని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కళాశాలలకు సూచించాయి. ఎదురుగా మనిషి లేకుండా కంప్యూటర్‌లో ఉన్న వారిని చూసి సమాధానాలు చెప్పడంలో అభ్యర్థులు తడబాటుకు గురవుతున్నట్లు గుర్తించాయి. కోడింగ్‌, ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌లో ప్రతిభ చూపుతున్న వారు మౌఖిక పరీక్షల్లో ఇబ్బందులు పడుతున్నారు. వర్చువల్‌ ఇంటర్వ్యూల్లో అభ్యర్థుల ముఖ కవళికలను గుర్తించేందుకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు కృత్రిమ మేధ(ఏఐ) ద్వారా ఇమేజ్‌ అనలిటిక్స్‌ను వినియోగిస్తున్నాయి. దీనిపై పూర్తి అవగాహన ఉంటేనే సమర్థంగా నెగ్గుకు వచ్చే అవకాశం ఉంటుంది. గతేడాది 3-4 నెలల్లోనే 5వేలు వర్చువల్‌ మౌఖిక పరీక్షలు పూర్తి చేసినట్లు హెక్సావేర్‌ డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ వీరప్పజీ శివన్న ఇటీవల ఓ సమావేశం వెల్లడించారు. టీసీఎస్‌ కంపెనీ 4-5 నెలల్లో 30వేల మందికి ఆన్‌లైన్‌ మౌఖిక పరీక్షలు నిర్వహించినట్లు ఆ సంస్థ ప్రతినిధి పర్వీన్‌ అహ్మద్‌ ఇటీవల తెలిపారు. తక్కువ సమయంలోనే ఎక్కువ ఎంపికలకు అవకాశం ఉన్నందున ఇదే విధానాన్ని కొనసాగించాలని కంపెనీలు భావిస్తున్నాయి.

ప్రాంగణ ఎంపికలు మారిపోయాయి..
‘‘కరోనాకు ముందు.. ఆ తర్వాత అన్నట్లు ప్రాంగణ ఎంపికలు మారిపోయాయి. పూర్తిగా వర్చువల్‌ విధానమే కొనసాగుతోంది. విద్యార్థులు ఏ కంపెనీలో ఎంపికకు ఆసక్తి చూపుతున్నారో అందుకు అనుగుణంగా వారిని కళాశాలల్లోనే సిద్ధం చేయాలి. ఇంటర్న్‌షిప్‌లను సమర్థవంతంగా పూర్తి చేసేందుకు ముందు నుంచి తర్ఫీదు ఇవ్వాలి. వర్చువల్‌ ఇంటర్వ్యూలను ఇంజినీరింగ్‌ కళాశాలలు తమ బోధన ప్రక్రియలో భాగం చేయాలి’’

- కోట సాయికృష్ణ, ఏపీ శిక్షణ ఉపాధి అధికారుల సమాఖ్య గౌరవాధ్యక్షులు

ఉద్యోగానికి ముందే అన్నీ..
ఇంతకు ముందు వరకు ఉద్యోగానికి ఎంపిక చేసుకున్న తర్వాత సంస్థలోకి తీసుకొని శిక్షణ ఇచ్చేవి. ఇది సంస్థలకు వ్యయంగా మారుతుండటంతో ఇప్పుడు ఈ విధానాన్ని దాదాపుగా అన్ని సంస్థలూ మార్చేశాయి. చదువుతోపాటే శిక్షణ అంటున్నాయి. ఇంజినీరింగ్‌ పూర్తికాగానే పని చేసే నైపుణ్యాలతో రావాలని సూచిస్తున్నాయి. నాలుగో ఏడాది మొదట్లోనే ఎంపిక చేసుకొని, ఆరు నెలలు ఇంటి వద్దనే ఆన్‌లైన్‌లో శిక్షణ ఇస్తున్నాయి.

ఇదీ చదవండీ..రాష్ట్రానికి అదనపు పన్ను సొమ్ము అందించిన కేెంద్రం

ABOUT THE AUTHOR

...view details