ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

DSC-2008: డీఎస్సీ-2008 అభ్యర్థులకు ఉద్యోగాలు: మంత్రి సురేశ్‌ - AP News

12 ఏళ్లుగా పోరాటం చేస్తున్న డీఎస్సీ-2008 బాధితులకు న్యాయం చేస్తున్నామని మంత్రి సురేశ్‌ వెల్లడించారు. 2,193 మందికి ఎస్‌జీటీ పోస్టులు ఇవ్వాలని నిర్ణయించినట్టు మంత్రి తెలిపారు.

డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌
డీఎస్సీ-2008 బాధితుల కోసం ప్రత్యేక రిక్రూట్‌మెంట్‌

By

Published : Jun 11, 2021, 5:16 PM IST

Updated : Jun 12, 2021, 4:55 AM IST

డీఎస్సీ-2008కి సంబంధించి 2,193 మంది అభ్యర్థులకు కనీస టైమ్‌ స్కేలుతో సెకండరీ గ్రేడ్‌ టీచర్లుగా ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్‌ ప్రకటించారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కేవలం ఈ డీఎస్సీకి మాత్రమే వర్తించేలా ప్రత్యేకంగా మినిమమ్‌ టైం స్కేల్‌ ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. డీఎస్సీ-2008లో అర్హతల మార్పు కారణంగా 4,657 మంది అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోయారన్నారు. సీఎం జగన్‌ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వీరందరి జాబితాను పరిశీలించి, అర్హులను ఎంపిక చేశామన్నారు. వీరికి వృత్తి శిక్షణ ఇచ్చి, ప్రస్తుతం ఉన్న ఖాళీల్లో నియమిస్తామని మంత్రి చెప్పారు. 2014 ఎన్నికల్లో తెదేపా వీరికి హామీ ఇచ్చి, రాజకీయానికి వాడుకుందే తప్ప ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. డీఎస్సీ-2018లో కోర్టు కేసుల కారణంగా పెండింగ్‌లో ఉన్న 486 వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులకు నియామకాలు చేపడుతున్నామని మంత్రి ప్రకటించారు. 374 తెలుగు భాషాపండిత పోస్టులపై పెండింగ్‌లో ఉన్న రిట్‌ పిటిషన్‌ను త్వరలో పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. డీఎస్సీ-2018లో 7,247 పోస్టులకు ప్రకటన ఇవ్వగా ఇప్పటి వరకు 6,361 పోస్టులు భర్తీ చేశామని చెప్పారు.

పరీక్షలకు సమయం కావాలి
'పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి 40 రోజులు సమయం పడుతుంది. ఈ పరీక్షలతో పాటు జేఈఈ, నీట్‌, ఎంసెట్‌కు సన్నద్ధం కావడానికి విద్యార్థులకు సమయం ఇవ్వాలి. ఇవన్నీ పరిశీలించి షెడ్యూల్‌ రూపొందించాలని అధికారులను ఆదేశించాం. కరోనా తగ్గుముఖం పట్టాక పరీక్షలు నిర్వహిస్తాం. కొవిడ్‌ బారిన పడినవారు పరీక్షలు రాయలేకపోతే వారికి మరోసారి పరీక్షలు నిర్వహిస్తాం. వీటిని సప్లిమెంటరీగా కాకుండా రెగ్యులర్‌ పరీక్షలుగానే పరిగణిస్తాం. పరీక్షల షెడ్యూల్‌ను త్వరలోనే వెల్లడిస్తాం. ఇంకా విద్యాసంవత్సరం ఎక్కడా ప్రారంభం కాలేదు. ఫిర్యాదులు వస్తే టాస్క్‌ఫోర్సులు వేసి, యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం’ అని మంత్రి చెప్పారు. మార్పు చేసిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాఠ్యప్రణాళికను ఆవిష్కరించారు.

విద్యార్థులకు నేటి నుంచి ఆన్‌లైన్‌ తరగతులు
పాఠశాల విద్యార్థులకు శనివారం నుంచి ఆన్‌లైన్‌ పాఠాలు ప్రారంభించనున్నారు. జూన్‌ 30వరకు వేసవి సెలవులు ఇచ్చినందున ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ జిల్లా విద్యాధికారులకు సూచించింది. దూరదర్శన్‌, రేడియో, యూట్యూబ్‌, వాట్సప్‌గ్రూపు ద్వారా 1-10 తరగతులకు పాఠాలు నిర్వహించాలని తెలిపింది.

ఇదీ చదవండీ...

CM Jagan Delhi Tour: ముగిసిన సీఎం జగన్ దిల్లీ పర్యటన

Last Updated : Jun 12, 2021, 4:55 AM IST

ABOUT THE AUTHOR

...view details