ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణ: నిర్లక్ష్యం... తెరాస నేతలపై కోర్టు ఆగ్రహం

By

Published : Jan 27, 2021, 9:17 PM IST

కొందరు తెరాస నాయకులపై హైదరాబాద్​లోని ప్రజాప్రతినిధుల న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయా నేతలపై కాజీపేట పోలీసులు నాన్ బెయిలబుల్ వారంట్ అమలు చేయకపోవడాన్ని తప్పుపట్టింది. తమ ఆదేశాలు పట్టించుకోకపోతే ఆ స్టేషన్ ఎస్​హెచ్​ఓపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించింది.

people representatives court in hyderabad fires on trs leaders
తెరాస నేతలపై హైదరాబాద్ ప్రజాప్రతినిధుల కోర్టు ఆగ్రహం

కొంతకాలంగా విచారణకు హాజరు కానందుకు.. తెరాస నేత తక్కళ్లపల్లి రవీందర్ రావు తదితరులపై హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయనతో సహా ఏడుగురికి రిమాండ్ విధించిన న్యాయస్థానం.. అనంతరం ఒక్కొక్కరికి రూ. 10 వేల పూచీకత్తులతో బెయిల్ మంజూరు చేసింది. నిందితుడిగా ఉన్న ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆచూకీ లభించడం లేదని సుబేదారి పోలీసులు ఇచ్చిన వివరణను న్యాయస్థానం రికార్డు చేసింది.

రిమాండ్.. బెయిల్...

వరంగల్ జిల్లా కోర్టులో ఉన్నప్పుడే దాస్యం వినయ్ భాస్కర్, తక్కళ్లపల్లి రవీందర్ రావు, రమేశ్​, దర్శన్ సింగ్, మనోజ్, రహమున్నీసా, లలితపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ అయింది. హైదరాబాద్​లోని ప్రజా ప్రతినిధుల కోర్టుకు బదిలీ అయినప్పటి నుంచి వారు విచారణకు హాజరు కాలేదు. ఈరోజు రాగానే వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్ విధించి.. అనంతరం బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. మరోకేసులో కాజీపేట పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

క్రిమినల్ కేసు నమోదు చేస్తాం:

వరంగల్ తెరాస నేతలు అమరేందర్ రెడ్డి, శ్రీరాములు, నరోత్తంరెడ్డిలపై నాన్ బెయిలబుల్ వారంట్ ఎందుకు అమలు చేయడం లేదని పోలీసులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఫిబ్రవరి 3లోగా వారంట్ అమలు చేయకపోతే.. కాజీపేట ఎస్​హెచ్ఓపై క్రిమినల్ కేసు నమోదుకు ఉత్తర్వులు జారీ చేస్తామని హెచ్చరించింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గతంలో నమోదైన పలు కేసుల్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విచారణకు హాజరయ్యారు.

ఇదీ చదవండి :సమన్వయంతో పని చేద్దాం.. ఎన్నికలు సజావుగా నిర్వహిద్దాం: ఎస్​ఈసీ

ABOUT THE AUTHOR

...view details