పుర, నగరపాలక సంస్థల్లో కొత్త ఆస్తి పన్ను విధానం మేరకు ఆస్తుల విలువను మదించి ఆ వివరాలతో ప్రత్యేక తాఖీదులు (స్పెషల్ నోటీసులు) సిద్ధం చేస్తున్నారు. 2021-22లో మొదటి అర్ధ సంవత్సరానికి వేసిన ఇళ్లు, దుకాణాలు, ఇతర సముదాయాల వారీగా వేసిన ఆస్తి పన్ను వివరాలతో ఈ తాఖీదులు జారీ చేయనున్నారు. వచ్చే నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త విధానంలో విధించిన పన్నులపై అభ్యంతరాలుంటే నోటీసులు అందిన 15 రోజుల్లోగా లిఖిత పూర్వకంగా తెలియజేయాల్సి ఉంటుంది. గడువులోగా అభ్యంతరాలు రానట్లైతే ప్రజలు సమ్మతిస్తున్నట్లుగా భావించి కొత్త పన్నులు వసూలు చేస్తారు.
పాలకవర్గ తీర్మానం మేరకు ఇళ్లు, దుకాణాలకు పన్నులు విధిస్తూ ప్రత్యేక తాఖీదుల జారీ చేయడం, వీటిపై వచ్చే అభ్యంతరాల పరిష్కారం, తుది డిమాండు నోటీసులిచ్చి పన్నుల వసూళ్ల కోసం సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఇళ్లు, దుకాణాలకు వార్షిక అద్దె విలువ (ఏఆర్‌వీ) ఆధారంగా ఆరు నెలలకు ప్రస్తుతం అమలులో ఉన్న పన్ను, కొత్తగా విధించిన పన్ను, పాత పన్నుపై 15% మించకుండా పెంపుతో పెరుగుదల వివరాలను ప్రత్యేక తాఖీదుల్లో పేర్కొంటున్నారు. వీటిపై ఇళ్లు, దుకాణం ఫొటోలు కూడా ముద్రిస్తారు. వాటిని సిబ్బంది, వాలంటీర్ల సహకారంతో ప్రజలకు అందించనున్నారు.
పెరిగిన పన్నులు మార్చిలోగా వసూలు