ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రాజధాని తరలింపుపై నేడు ప్రత్యేక బెంచ్ విచారణ - రాజధానిపై ఏపీ హైకోర్టు విచారణ

రాజధాని అమరావతి, సీఆర్​డీఏ అంశాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారించేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని ఈ త్రిసభ్య ధర్మాసనం.... నేడు ఈ వ్యాజ్యాలపై విచారించనుంది.

special bench to hear lawsuits on capital today
special bench to hear lawsuits on capital today

By

Published : Jan 23, 2020, 6:30 AM IST

రాజధాని అమరావతి, సీఆర్‌డీఏ అంశాలతో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారణ జరిపేందుకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటైంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ ఎం. సత్యనారాయణమూర్తితో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేశారు. రాజధానిపై అంశంపై దాఖలైన వ్యాజ్యాలను గురువారం త్రిసభ్య ధర్మాసనం విచారించనుంది. సీజే పరిపాలనా పరమైన నిర్ణయం మేరకు త్రిసభ్య ధర్మాసనం ఏర్పడింది. మరోవైపు శాసనసభ ఆమోదం తెలిపిన వికేంద్రీకరణ బిల్లు , సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును సవాలు చేస్తూ భాజపా రాష్ట్ర ఫైనాన్స్ కమిటీ కన్వీనర్, విశాఖపట్నానికి చెందిన వ్యాపారి సీహెచ్ రామకోటయ్య, విజయవాడకు చెందిన వ్యాపారి శీలం మురళీధరరెడ్డి హైకోర్టులో వేర్వేరుగా దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాలపై హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. బిల్లులపై బుధవారం శాసనమండలిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ బిల్లులను సవాలు చేస్తూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలపై విచారణను గురువారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

ద్రవ్యబిల్లులు.... కాదు సాధారణ బిల్లులే

రామకోటయ్య తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అశోక్ భాన్ వాదనలు వినిపించారు . ద్రవ్య(మనీ) బిల్లులు తరహాలో ఆ రెండు బిల్లులను శాసనసభలో ప్రవేశ పెట్టారన్నారు. ద్రవ్య బిల్లు తరహా అని ఎలా చెబుతున్నారని ధర్మాసనం ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం అవి ద్రవ్య బిల్లులని ప్రస్తావించకపోయినా... సభలో ప్రవేశ పెట్టిన ఆ తరహాలోనే ఉందని న్యాయవాది అశోక్ భాన్ సమాధానమిచ్చారు. దీనిపై అడ్వొకేట్ జనరల్ ఎస్ . శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.... అవి రెండు సాధారణ బిల్లులేనన్నారు. శాసనసభ స్పీకర్ కూడా అవి ద్రవ్య బిల్లులని సర్టిఫికేషన్ ఇవ్వలేదన్నారు. వ్యాజ్యాలపై విచారణ జరిగే సమయానికి శాసన మండలిలో ఆ బిల్లులపై చర్చ జరుగుతోందన్నారు. అవి మనీ బిల్లులు కావని ఏజీ కోర్టుకు చెప్పిన విషయాన్ని నమోదు చేయాలని న్యాయవాది అశోక్ భాన్ ధర్మాసనాన్ని కోరారు. నమోదు చేస్తామని ధర్మాసనం తెలిపింది. మండలిలో చర్చ జరుగుతోంది కదా కొంత సమయం వేచి చూద్దామని ధర్మాసనం సూచించింది. అశోక్ భాన్ స్పందిస్తూ.... ప్రజల ప్రయోజనాల దృష్ట్యా ఈ దశలోనైనా న్యాయసమీక్ష జరపొచ్చని తెలిపారు. రాజధాని అమరావతిని నేలమట్టం చేసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి లెక్కలేకుండా ' బుల్ ఇన్ చైనా షాప్ ' తీరుగా వ్యవహరిస్తున్నారన్నారు. ఆ వాదనల పై అడ్వకేట్ జనరల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఎంను ఉద్దేశించి అలా పేర్కొనడం సరి కాదన్నారు. ధర్మాసనం స్పందిస్తూ . . 'మేమేమి ఆ వాదనల్ని నమోదు చేయడం లేదు కదా ? వాళ్లు చెప్పేదాన్ని చెప్పనీయండి , మీరు చెప్పే వాదనలు వింటాం కదా' అని వ్యాఖ్యానించింది . న్యాయవాది అశోక్ బాన్ వాదనలు కొనసాగిస్తూ.... రాజధాని నిర్మాణం చేపడతారని విశ్వసించి భూములిచ్చిన 29 గ్రామాల రైతుల చట్టబద్ధమైన హక్కుల్ని కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. రాజధాని, హైకోర్టు ప్రధాన బెంచ్ ఏర్పాటు అంశం కేవలం పార్లమెంట్, రాష్ట్రపతి అధికార పరిధిలోనిదన్నారు. ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వానికి పాత్ర ఉండదని వివరించారు.

వేచి చూద్దాం

ప్రస్తుతం శాసన మండలిలో ఈబిల్లులపై చర్చ జరుగుతున్నందున ఒకటి, రెండు రోజులు ఎందుకు వేచి చూడకూడదని పిటిషనర్లను ఉద్దేశించి ధర్మాసనం వ్యాఖ్యానించింది. అశోక్ భాన్ స్పందిస్తూ... ఒకవైపు చర్చ జరుగుతున్నా మిగిలిన పనులు జరిగిపోతున్నాయన్నారు . కార్యనిర్వాహక , శాసన , న్యాయ వ్యవస్థల్ని లెక్కచేయకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని అన్నారు. రాజధాని ప్రాంత రైతుల్ని భయబ్రాంతులకు గురిచేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో ప్రాథమికంగానే వాటికి అడ్డుకట్ట వేయాలన్నారు. కోర్టు జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వ చర్యలను నిలువరించాలని కోరారు. చట్టం అనుమతించినంత వరకు జోక్యం చేసుకుంటామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అలా అదేశించకుండా నిలువరించండి

సీఆర్డీఏ చట్టం ఉపసంహరణ బిల్లును సవాలు చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యంలో పిటిషనర్ తరఫు న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపిస్తూ.... 'శాసన అధికారం ఉందికదా అని వ్యవస్థల్ని కూలదోసి ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే కుదరదు. విశాఖకు కార్యాలయాలు తరలిపోనున్నాయని ఇప్పటికే నోటిమాటగా ఉద్యోగులకు చెప్పారు. అలాంటి మౌఖిక ఆదేశాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని ఆదేశించండి. ఏజీ నుంచి ఆ మేరకు హామీని తీసుకోండి' అని పేర్కొన్నారు. ధర్మాసనం స్పందిస్తూ... 'మీ వాదనలపై మేము సంతృప్తి చెందితే తగిన ఆదేశాలిస్తాం' అని చెప్పింది. రాజధాని అమరావతితో ముడిపడి ఉన్న వ్యాజ్యాలన్నింటిపై విచారణకు ప్రత్యేకంగా ఓ బెంచ్​ను ఏర్పాటు చేస్తామని పేర్కొంది. విచారణను గురువారానికి వాయిదా వేసింది.

144 సెక్షన్ వ్యాజ్యాల విచారణ అప్పుడే

144 సెక్షన్​పై వ్యాజ్యాల విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా రాజధాని గ్రామాల్లో 144 సెక్షన్ విధింపు, అభ్యంతరాలు సమర్పించేందుకు తగిన సమయం ఇవ్వలేదని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఫిబ్రవరి 3కు వాయిదా పడింది. కొన్ని వ్యాజ్యాల్లో ప్రమాణపత్రం దాఖలు చేశామని , మరికొన్నింట్లో ఇంకా దాఖలు చేయాల్సి ఉందని ఏజీ కోర్టుకు తెలిపారు. ఉల్లంఘనలకు పాల్పడిన పోలీసులపై విచారణకు ఆదేశించామని , పూర్తి కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.... ప్రమాణపత్రాల ప్రతుల్ని పిటిషనర్లకు ఇవ్వాలని ఏజీకి సూచించింది. ప్రభుత్వ కౌంటర్లపై తిరుగు సమాధానంగా కౌంటర్లు వేయాలని పిటిషనర్లకు గడువిచ్చింది.

ఇదీ చదవండి:సెలెక్ట్ కమిటీకి రాజధాని వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులు

ABOUT THE AUTHOR

...view details