పట్టణ పేదలందరికీ 2022 నాటికి సొంతిల్లు అందించాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై)ను 2017లో ప్రారంభించింది. దేశంలోని మురికివాడల్లో నివసిస్తున్న 1.80 కోట్ల నిరుపేద కుటుంబాలకు, మురికివాడేతర ప్రాంతాల్లోని మరో 20 లక్షల పేద కుటుంబాలకు ఇళ్లు కట్టించి అందించాలన్నది దీని లక్ష్యం. దీనిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రాష్ట్రంలోని పుర, నగరపాలక సంస్థల్లో పేదల కోసం పీఎంఏవై- ఎన్టీఆర్ నగర్ పేరుతో 2,62,216 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాయి. నిర్మాణ రంగంలో ఆధునిక సాంకేతికతను జోడించి విట్రిఫైడ్ టైల్ ఫ్లోరింగ్, వంటగదిలో స్టీల్ సింక్, గ్రానైట్ ప్లాట్‌ఫారం, ట్రాక్ కిటికీలతో 15 నెలల్లో పూర్తి చేసేలా నిర్మాణ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేయించింది. అంతర్గత రహదారులు, తాగునీటి సరఫరా, మురుగునీటి శుద్ధి వ్యవస్థ, వరదనీటి కాలువలు, ఎల్‌ఈడీ వీధిదీపాలు, సామాజిక భవనాలు, ఉద్యానాలు, క్రీడామైదానాలతో కాలనీలను తీర్చిదిద్దేందుకు పనులు చేపట్టారు. 2019 సాధారణ ఎన్నికల నాటికి పలు జిల్లాల్లో సగటున 60-70 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వం మారిన తర్వాత పనులు నిలిచిపోయాయి. పథకం పేరు మారినా పనులు ముందుకు సాగలేదు. అప్పటికే అందంగా ముస్తాబైన మూడంతస్తుల భవనాల చుట్టూ ఇప్పుడు ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు మొలిచాయి. పాములకు ఆవాసమవుతున్నాయి. కొన్నిచోట్ల ఇళ్లలో తలుపులు, కిటికీలు, ఎలక్ట్రికల్, మరుగుదొడ్లలోని సామగ్రి దొంగల పాలవుతున్నాయి. 18చోట్ల లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసినా రోడ్లు, కాలువలు, తాగునీరు వంటి మౌలిక వసతులు లేవు. అవన్నీ కల్పించాక కబురుపెడతామన్న అధికారులు మళ్లీ ఆ ఊసెత్తకపోవడంతో వీరంతా ఇప్పటికీ అద్దె ఇళ్లల్లోనే బతుకుతున్నారు. అసంపూర్తిగా, నిరుపయోగంగా ఉన్న ఈ గృహాలను కొన్ని జిల్లాల్లో తాత్కాలికంగా కొవిడ్ కేంద్రాలుగా మార్చారు.
ఖరీదైన సౌకర్యాలు.. కల్లలైన ఆశలు
కృష్ణా జిల్లా జక్కంపూడిలో రూ.228.38 కోట్లతో 6,576 మంది కోసం నిర్మించిన ఈ ఇళ్లను చూస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. పేదలు తమ జీవితంలో నిర్మించుకోలేని స్థాయిలో వీటిని కట్టారు. టైల్స్ నుంచి వంట గదిలో సింక్ వరకు అన్నీ ఖరీదైన వస్తువులే. రహదారులు, కాలువలు, వీధి దీపాలు, భూగర్భ మురుగునీటి వ్యవస్థ పనులు పూర్తయితే గృహప్రవేశాలు చేసేందుకు లబ్ధిదారులు సిద్ధమయ్యారు. వీటి కోసం రూ.155.35 కోట్లతో ఇంజినీర్లు అంచనాలు కూడా రూపొందించారు. రెండేళ్ల క్రితం పనులు నిలిచిపోవడంతో పేదల కలలు కల్లలయ్యాయి.
ఎక్కడెక్కడ.. ఎలా ఉన్నాయంటే..
ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతుల్లేని నివాస సముదాయాలు 80
కృష్ణా, గుంటూరు, విశాఖపట్నం, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో పలుచోట్ల 80-90% ఇళ్ల నిర్మాణం పూర్తయినా మౌలిక వసతులు కల్పించలేదు.
బిల్లులు సకాలంలో చెల్లించని కారణంగా ఇళ్ల నిర్మాణం నిలిపివేసిన ప్రాంతాలు 60
అత్యధికంగా కృష్ణా, ప్రకాశం, కర్నూలు, కడప, అనంతపురం, విజయనగరం, విశాఖపట్నం, నెల్లూరు జిల్లాల్లో పనులు నిలిచిపోయాయి.
వర్షాల కారణంగా ఇళ్ల మధ్య నీరు చేరిన ప్రాంతాలు 30
రహదారులు, కాలువలు ఏర్పాటు చేయకపోవడంతో గుంటూరు, మంగళగిరి, నరసరావుపేట, రేపల్లె, కడపలో చలమారెడ్డిపల్లె, నంద్యాల, ఎమ్మిగనూరు, కాకినాడ, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో వర్షపు నీరు నిలిచిపోతోంది.
అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారినవి 17
అనంతపురం, కృష్ణా, కడప, విశాఖపట్నం, చిత్తూరు, శ్రీకాకుళం, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో పలుచోట్ల జూదరులకు, మందుబాబులకు పేదల ఇళ్లు అడ్డాగా మారాయి.
ఇళ్లలో నుంచి విలువైన వస్తువులు దొంగల పాలవుతున్న ప్రాంతాలు 11
నందిగామ, తెనాలి, ఎమ్మిగనూరు, కడపలో సరోజినీనగర్, శ్రీకాళహస్తి, మదనపల్లె, నెల్లూరు, గూడూరు, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా బోడసకుర్రు, శ్రీకాకుళంలో నిర్మాణం పూర్తయిన, అసంపూర్తిగా నిలిచిపోయిన ఇళ్లలో నుంచి కిటికీలు, స్విచ్‌బోర్డులు, వైర్లు, ఇతర నిర్మాణ సామగ్రిని దొంగలు ఎత్తుకెళుతున్నారు.
నిర్మాణం పూర్తయిన ఇళ్లను కొవిడ్ కేంద్రాలుగా ఉపయోగిస్తున్నవి 16
గుంటూరు, కర్నూలు జిల్లాలో చెరో నాలుగు, పశ్చిమ గోదావరి జిల్లాలో మూడు, నెల్లూరు, తూర్పు గోదావరి జిల్లాలో చెరో రెండు, శ్రీకాకుళం జిల్లాలో ఒకచోట టిడ్కో ఇళ్లలోనే కొవిడ్ కేంద్రాలు నిర్వహిస్తున్నారు.
మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించి అసంపూర్తిగా నిలిపివేసినవి 36
ఇళ్ల నిర్మాణం దాదాపుగా పూర్తయినచోట మౌలిక సదుపాయాల పనులు ప్రారంభించారు. అయితే బిల్లులు చెల్లింపులో జాప్యంతో విజయనగరం, గుంటూరు, తెనాలిలోని చినరావూరు, నెల్లూరు జిల్లాలో కావలి తదితర ప్రాంతాల్లో ఈ పనులు నిలిపివేశారు.