ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

raksha bandhan: రక్షాబంధన్​కి మరోపేరు ‘జయసూత్రం’ - Epic story on Rakshabandhan

సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక ఈ రాఖీపౌర్ణమి. ప్రేమ అనే రాఖీను చేతికి కట్టి.. ఆప్యాయతానురాగాల తీపిని పంచి.. "నువ్వు నాకు రక్ష.. నేను నీకు రక్ష" అనే జీవితపు హామీ తీసుకునే పండగే ఈ రక్షాబంధన్​. మరి ఈ శుభదినానికి ఇదే కాకుండా.. మరేన్నో ప్రత్యేకతలున్నాయటా... అవన్నీ తెలుసుకుందాం రండి..

special
special

By

Published : Aug 22, 2021, 7:24 AM IST

త్మీయతలు, అనురాగాలు, అనుబంధాల సౌరభాల్ని వెదజల్లే అపురూపమైన పర్వదినం- రాఖీపౌర్ణమి. సోదర సోదరీమణుల నిరుపమాన బాంధవ్యానికిది ప్రతిఫలనంగా విలసిల్లుతోంది. ‘రాకా’ అంటే నిండుదనం, పున్నమి. రాకా పున్నమినాడు ధరించే ‘రక్ష’ను రాఖీగా వ్యవహరిస్తున్నారు. సోదరుడికి సహోదరి శుభాకాంక్షలతో ధరింపజేసే రక్ష వల్ల వారిరువురికీ శ్రేయస్సు చేకూరుతుందని భవిష్యోత్తర పురాణం పేర్కొంది. ధర్మయుతంగా జీవిస్తూ, సోదరీమణులపై అవ్యాజమైన ప్రేమాభిమానాల్ని కనబరిచే సోదరులకు రక్షాబంధనం సర్వదా రక్షణగా నిలుస్తుందని విష్ణుపురాణం వెల్లడించింది.

రక్షాబంధనానికి ‘జయసూత్రం’ అనే పేరూ ఉంది. పాండవులకు విజయం చేకూరడానికి శ్రీకృష్ణుడి ఆధ్వర్యంలో ధర్మరాజు రక్షాబంధన వేడుక నిర్వహించాడని మహాభారతం ప్రస్తావించింది. రాఖీని ‘భక్తి కంకణం’గా భాగవతం అభివర్ణించింది. తన అనన్య సామాన్యమైన భక్తి ప్రపత్తులతో శ్రీహరిని బలిచక్రవర్తి ప్రసన్నం చేసుకున్నాడు. భక్తి బంధంతో విష్ణువును తన వశం చేసుకున్నాడు. లక్ష్మీదేవి తల్లడిల్లింది. బలిచక్రవర్తిని సోదరుడిగా భావిస్తూ రక్షను ధరింపజేసింది. ఏం కావాలో కోరుకొమ్మన్నాడు బలి. తన పతిని కానుకగా లక్ష్మి ఇవ్వమని కోరింది. తథాస్తు అన్నాడు బలి. విష్ణువునే లక్ష్మి బహుమతిగా అందుకున్న విశేష పర్వదినమే- శ్రావణపౌర్ణమి.

మహాగణపతి మానసపుత్రికగా ‘సంతోషి’ అభివ్యక్తమైంది శ్రావణ పౌర్ణమినాడేనని గణేశ పురాణం వివరించింది. లాభక్షేమాల కోసం సోదరీమణుల్ని సర్వదా సోదరులు ఆదరించాలని, వారి చేత పవిత్ర బంధనాన్ని ధరింపజేసుకోవాలని ఈ పురాణం సూచించింది. విష్ణువు రక్ష స్థితికారకుడు. విష్ణు జన్మనక్షత్రమైన శ్రావణం, పూర్ణిమ తిథితో సమ్మిళితమై ఉన్నరోజే శ్రావణ పౌర్ణమి. ఈ రోజున విష్ణుశక్తి రక్షాబంధనాల్ని ఆశ్రయించి ఉంటుందని, శ్రీహరి సూర్యనారాయణుడిగా లోకైక క్రాంతిర్మయుడిగా దివ్యంగా వెలుగొందే అపరాహ్ణ కాలంలో రక్షను ధరించాలని కూర్మపురాణం విశదపరిచింది.

రాఖీ అంటే మూడు పోగుల బంధనం. ఎరుపు, పసుపు, తెలుపురంగు దారాల్ని ఏకీకృతం చేసి, దానికి పసుపుకొమ్ము కట్టాలి. లక్ష్మీనారాయణులు, శివపార్వతుల మూర్తుల చెంత ఆ రక్షను ఉంచి పుష్పాలతో పూజించి, పసుపు కుంకుమలతో అలంకరించాలి. సోదరుడికి సోదరి విజయ తిలకం దిద్ది, మంగళిహారతిని ఇచ్చి మధుర పదార్థాల్ని తినిపించి ఆపై సోదరుడి ఎడమచేతి మణికట్టుకు పసుపు రాసి రక్షను ధరింపజేయాలని వ్రతరత్నాకరం నిర్దేశించింది. రక్షలో ఉండే మూడు పోగులు త్రిమూర్తులకు, త్రిమాతలకు సంకేతం. వీటినే దేవ, పితృ, రుషి రుణాలకు సూచకంగా చెబుతారు.

జైనులు శ్రావణపూర్ణిమను ‘నర్లీపూర్ణ’మిగా నిర్వహించుకుంటారు. సముద్ర నదీజలాల్లో కొబ్బరికాయల్ని జారవిడిచి ఈ సంవత్సరమంతా జలసమృద్ధి కొనసాగాలని ఆకాంక్షిస్తారు. ఐశ్వర్య కారకుడైన ఈశ్వరుడు, మహాలక్ష్మిని ధనాధిష్ఠాన దేవతగా శ్రావణపౌర్ణమినాడే నియమించాడని రుద్రసంహిత పేర్కొంది. సృష్టికర్త బ్రహ్మ శారదాదేవిని విజ్ఞాన ఘన రూపిణిగా ఈ పౌర్ణమినాడే పట్టం కట్టాడని శ్రీవిద్యాసూక్తం వివరించింది. వేదాల్ని అపహరించిన సోమకాసురుణ్ని, వధించడానికి హయగ్రీవుడిగా శ్రీహరి అవతరించింది శ్రావణపూర్ణిమ నాడేనంటారు. శివసంకల్ప శక్తితో దేవ భాషగా ప్రస్తావించే సంస్కృతం శ్రావణపౌర్ణమి రోజున సాకారమైందని రుగ్వేదం వెల్లడించింది.

సోదర సోదరీమణుల ప్రేమాస్పద బాంధవ్యానికి, వారి మధ్య వెల్లివిరిసే వాత్సల్యానికి రక్షాబంధనం వేడుక- సమున్నత ప్రతీక!

ఇదీ చదవండీ..నిధులున్నా పనులు నిల్​.. వ్యయంలో ప్రభుత్వ నియంత్రణతో నిరాశ

ABOUT THE AUTHOR

...view details