తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం దివ్యక్షేత్రంగా రూపుదిద్దుకొంది. పంచనారసింహ క్షేత్రాన్ని... భక్తులకు దివ్యానుగ్రహం కలిగేలా... విశాలంగా, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా అభివృద్ధి చేసి విస్తరించారు. భక్తులకు కావాల్సిన వసతులు, సౌకర్యాలపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి..... వివిధ పనులు చేపట్టారు. అందులో చాలావరకు పూర్తికాగా...మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ప్రముఖుల విడిది కోసం ప్రెసిడెన్షియల్ విల్లాల నిర్మాణం పూర్తి కాగా... భక్తుల విడిది కోసం కాటేజీల నిర్మాణం జరగాల్సి ఉంది.
యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి సంబంధించి బృహత్ ప్రాజెక్టును దేవాదాయశాఖతోపాటు యాదాద్రి ఆలయ అభివృద్ధి సంస్థ చేపడుతోంది. అద్భుతంగా ఆలయం అభివృద్ధి చెందడంతోపాటు... పెద్దఎత్తున వసతుల కల్పన జరిగిన దృష్ట్యా నిర్వహణ అత్యంత కీలకం కానుంది. ప్రస్తుతం దేవాదాయశాఖ ఆధ్వర్యంలో ఆలయ నిర్వహణ జరుగుతోంది. భారీస్థాయిలో అభివృద్ధి, విస్తరణ నేపథ్యంలో.... ప్రస్తుతం ఉన్న విధానం ఆలయ నిర్వహణ, పాలనకు సరిపోదని అంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో ప్రత్యేక ఆలయ బోర్డు ఏర్పాటు చేయాలని..., పాలకమండలి అదే రకంగా ఉండాలని అంటున్నారు.