మీడియాతో మాట్లాడుతున్న స్పీకర్ తమ్మినేని సీతారాం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేశ్‌కుమార్‌ను రాష్ట్రపతి వెంటనే విధుల నుంచి తొలగించాలని సభాపతి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల్లో రాష్ట్రపతి, కేంద్రం, గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోరారు. ఒక రాజ్యాంగబద్ధమైన కమిషనర్ పదవిలో ఉన్నప్పుడు ఏదైనా సామాజికవర్గం, పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం తగదన్నారు. సీఎస్, వైద్య ఆరోగ్యశాఖ కార్యదర్శితో సంప్రదించకుండా ఎన్నికలను ఎలా వాయిదా వేశారని ప్రశ్నించారు. స్థానిక ఎన్నికలపై హైకోర్టు సరైన సమయంలో తీర్పు ఇచ్చి ఉంటే ఈ పాటికి ఎన్నికలు పూర్తి అయ్యేవని అభిప్రాయపడ్డారు.
అలా అయితే సీఎం ఎందుకు..?
పరిపాలనలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్‌ఈసీ) జోక్యం చేసుకుంటే సీఎం ఎందుకని స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో తీర్పు ఆలస్యంతో ఎన్నికల నిర్వహణ కూడా ఆలస్యమైందని చెప్పారు. స్థానిక ఎన్నికల వాయిదాను ఉద్దేశిస్తూ రాజ్యాంగ వ్యవస్థలు ప్రభావితం అవుతున్నాయని ఆయన ఆక్షేపించారు. ఎన్నికల నోటిఫికేషన్, విధివిధానాలు అమలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ పాత్ర ఉంటుందని.. జాతీయ విపత్తులు ఏర్పడితే ప్రభుత్వ యంత్రాంగం సూచనల మేరకు నిర్ణయం ప్రకటించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేయడం వరకే ఎన్నికల కమిషన్ విధి అని.. కానీ పాలనలో జోక్యం చేసుకోకూడదన్నారు. ఎన్నికల నిలుపుదల కారణంగా.. కేంద్రం నుంచి రావాల్సిన 5 వేల కోట్ల రూపాయల నిధులు ఆగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి బాధ్యత ఎవరిదని తమ్మినేని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:
స్థానిక ఎన్నికలు జరిగితే...కరోనా ఆపొచ్చు :సజ్జల