రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైన రాజకీయ క్రీడ జరుగుతుందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళం ఆర్‌అండ్‌బీ అతిది గృహంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కొన్ని వ్యవస్థల తీరుతో ప్రజల్లో చులకనభావం ఏర్పడిందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల విషయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై తమ్మినేని స్పందించారు.
ప్రస్తుత సమయంలో ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇవ్వడం సరైనది కాదని స్పీకర్ తమ్మినేని అభిప్రాయపడ్డారు. ఎన్నికల వ్యవస్థ ఇచ్చే ప్రకటనను గౌరవించాల్సిన ప్రభుత్వ వ్యవస్థే... వ్యతిరేకించిందంటే పరిస్థితి ఏంటో గమనించాలన్నారు. నాడు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని కోరితే ఎస్‌ఈసీ తిరస్కరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ఎస్‌ఈసీ నిర్ణయాన్ని గౌరవించిందని..అలాంటప్పుడు ఇవాళ ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాన్ని కూడా ఎన్నికల సంఘం గౌరవించాల్సిన అవసరముందన్నారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్న రాజ్యాంగ సంస్థలు గౌరవించాల్సిన అవసరం, బాధ్యత ఉందని తెలిపారు. కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఎన్నికల సంఘం గౌరవించాలని కోరారు.