ప్రముఖ గాయకుడు, తన తండ్రి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారని ఆయన తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. కరోనాతో పోరాడుతూ చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్పీబీ తాజా ఆరోగ్య పరిస్థితిపై ఆయన వీడియో సందేశాన్ని అభిమానులతో పంచుకున్నారు. వెంటిలేటర్ తొలగించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఆ రోజు రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
‘‘అందరికీ నమస్కారం. నాన్నగారి ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పూ లేదు. సోమవారం ఏవిధంగానైతే ఉందో నేడూ అలాగే ఉంది. నాన్నగారికి వెంటిలేటర్ తొలగించినట్లు ఉదయం నుంచి వార్తలు వస్తున్నాయి. అవేవీ నిజం కాదు. ఇంకా వెంటిలేటర్‌పైనే ఉన్నారు. ఆ రోజు రావాలని మేమూ ఆశిస్తున్నాం. తప్పకుండా వస్తుంది. ఎంజీఎం ఆస్పత్రి వైద్యులు నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన త్వరగా కోలుకునేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. మీ ప్రార్థనలు, ఆకాంక్షలు నిజమవుతాయని మేము దృఢంగా నమ్ముతున్నాం. మీ దీవెనలు ఆయనకు కావాలి. ఇలాగే మీ ప్రేమాభిమానులను కొనసాగించండి. ధన్యవాదాలు’’ అని ఎస్పీ చరణ్ వీడియో సందేశంలో పేర్కొన్నారు.