ప్రముఖ నేపథ్య గాయకుడు, ఐదున్నర దశాబ్ధాలుగా తమ అమృత గానంతో ప్రజలను అలరింపజేసిన పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం అనారోగ్య కారణాలతో పరమపదించడం దిగ్భ్రాంతి కలిగించిందని ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఎస్పీ బాలు కోలుకుంటున్నారని భావిస్తున్న తరుణంలోనే ఇలా జరగడం విచారకరమన్నారు. బాలు కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ బాలు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
గవర్నర్ సంతాపం
ఎస్.పి.బాలు మృతి పట్ల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతాపం తెలిపారు. ప్రజల హృదయాల్లో బాలు చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు.
సీఎం సంతాపం
గాన గంధర్వుడు ఎస్.పి.బాలు(74) ఈరోజు మధ్యాహ్నం 1.04 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎస్పీ బాలు మృతి పట్ల సీఎం జగన్ సంతాపం తెలిపారు. ఎస్పీ బాలు కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సంతాపం చెప్పారు. ఎస్పీబీగా ప్రసిద్ధి చెందిన బాలు ఇక లేరన్న వార్త ఆవేదన కలిగించిందని సీఎం అన్నారు. తన గాత్రంతో ఎన్నో పాటలు పాడి సామాన్యులను సైతం ఆకర్షించారన్నారు.
చంద్రబాబు సంతాపం
ఎస్పీ బాలు మృతికి తెదేపా అధినేత చంద్రబాబు సంతాపం తెలిపారు. బాలసుబ్రహ్మణ్యం ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు చంద్రబాబు ప్రగాఢ సానుభూతి చెప్పారు. కోట్లాది హృదయాలు వేడుకున్నా విధి కరుణించలేదని, రేపో మాపో ఆసుపత్రి నుంచి ఆరోగ్యంగా తిరిగి వస్తారనుకున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇక లేరన్న వార్త వినడానికే బాధాకరంగా ఉందని చంద్రబాబు ఆవేదన చెందారు. ఆయన మరణంతో ఒక అద్భుత సినీ శకం ముగిసిందన్నారు. ఇది దేశ చలనచిత్ర రంగానికి తీరనిలోటు అన్నారు.