నైరుతి రుతుపవనాలు ఈసారి ముందే పలకరించాయి. సాధారణంగా జూన్ ఒకటిన కేరళలో ప్రవేశించే 'నైరుతి' మూడు రోజుల ముందుగానే వచ్చేసిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది. ఆదివారం కేరళను తాకిన రుతుపవనాలు అక్కడ స్థిరంగా ఉన్నట్లు వాతావరణ విభాగ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను కారణంగా గత నెల నుంచి రుతు పవనాల్లో వేగం పెరిగిందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలోనే దేశంలోకి త్వరగా ప్రవేశించాయని స్పష్టం చేశారు.
రానున్న మూడు, నాలుగు రోజుల్లో కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలో మరింత ముందుకు కదులుతాయి. అక్కడి నుంచి ఈశాన్య ప్రాంతంవైపు నెమ్మదిగా పురోగమించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. వీటి ప్రభావంతో వచ్చే 5 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులు సంభవించడంతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు సగటు కంటే 2 నుంచి 4 డిగ్రీలు పెరగొచ్చని సూచించారు.