ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Corona Third Wave : 'కరోనా మళ్లీ విరుచుకుపడొచ్చు.. అందుకు కారణం ఇదే!'

Corona Third Wave : కొవిడ్​ వ్యాప్తి అప్పుడే తగ్గినట్లు భావించొద్దని... దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ హెచ్చరించారు. మళ్లీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టడానికి వైరస్‌ మ్యుటేషన్లు కారణమని ఆమె తెలిపారు. కొవిడ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించి ప్రపంచానికి తెలియజెప్పిన డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ.. ‘'ఈనాడు- ఈటీవీ భారత్​’'కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అనేక విషయాలు వెల్లడించారు.

Corona Third Wave
Corona Third Wave

By

Published : Feb 7, 2022, 8:01 AM IST

Corona Third Wave : మనదేశంలో ఇటీవల శరవేగంగా విస్తరించిన ఒమిక్రాన్‌ రకం కొవిడ్‌ కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. త్వరగా సాధారణ పరిస్థితులు నెలకొనాలనే ఆకాంక్ష ప్రజల్లో కనిపిస్తోంది. కానీ మనదేశంతో పాటు ప్రపంచ దేశాలకు కొవిడ్‌ ముప్పు తొలగిపోలేదని, మరొక ‘వేరియంట్‌’ రూపంలో మరికొంత కాలానికి విరుచుకుపడొచ్చని దక్షిణాఫ్రికా వైద్యురాలు డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీ వివరించారు. మళ్లీ మళ్లీ ఈ వ్యాధి తిరగబెట్టడానికి వైరస్‌ ఉత్పరివర్తనాలే (మ్యుటేషన్లు) కారణమని ఆమె తెలిపారు. మనిషి శరీరంలో రోగ నిరోధక శక్తిని తప్పించుకుని, వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించడం ఒమిక్రాన్‌ రకం కరోనా వైరస్‌ లక్షణమని, అందుకే కొద్ది రోజుల వ్యవధిలోనే ప్రపంచం మొత్తాన్ని చుట్టబెట్టిందని చెప్పారు. అప్రమత్తంగా వ్యవహరించడం, టీకాలు వేసుకోవడమే ఈ వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు ఉన్న పరిష్కారాలని పేర్కొన్నారు. కొవిడ్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించి ప్రపంచానికి తెలియజెప్పిన ఘనత డాక్టర్‌ ఏంజెలిక్‌ కోయెట్జీకి దక్కుతుంది. ఆమె దక్షిణాఫ్రికా మెడికల్‌ అసోసియేషన్‌ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్నారు. ‘ఈ వైరస్‌ను తాను ఎలా గుర్తించిందీ, దాని వ్యాప్తి, భవిష్యత్తు సవాళ్లపై తన అభిప్రాయాలు వెల్లడించారు.

  • ఒమిక్రాన్‌ వేరియంట్‌ను మీరు ఎక్కడ, ఎలా కనుగొన్నారు?

ఒక డాక్టర్‌గా రోజూ ఎంతో మంది రోగులను చూస్తాను. 2021 నవంబరు 18న నా దగ్గరకు వచ్చిన ఒక రోగికి ‘రాపిడ్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌’ చేస్తే, కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. రోగ లక్షణాలను గమినిస్తే, అవి ‘డెల్టా’ రకానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఆ తర్వాత అతని భార్య, మూడేళ్ల కుమారుడు, నాలుగు నెలల కుమార్తెకు పాజిటివ్‌ వచ్చింది. అదే రోజున నా క్లినిక్‌కు వచ్చిన మరో ముగ్గురు రోగుల్లోనూ ఇదే తరహా రోగ లక్షణాలు కనిపించాయి. నాకు ఎంతో ఆశ్చర్యం కలిగింది. అప్పటికే కొవిడ్‌ డెల్టా వేవ్‌ ముగిసి 8 వారాలైంది. కొత్త కేసులు రావడం లేదు. అటువంటి సమయంలో ఒక్కసారిగా పూర్తి భిన్నమైన రోగ లక్షణాలు కనిపించడంతో ఇది డెల్టాకు భిన్నమైన కరోనా వైరస్‌ రకం కావచ్చనే అనుమానం వచ్చింది. అలా ఒమిక్రాన్‌ వేరియంట్‌ను వెలుగులోకి తీసుకురాగలిగాను.

  • చైనాలో వెలుగుచూసిన ‘నియోకోవ్‌’ వేరియంట్‌ అత్యంత ప్రమాదకరమైనదనే అభిప్రాయం వినిపిస్తోంది. దీనిపై మీ విశ్లేషణ ఏమిటి?

ఇప్పటికైతే అంత ప్రమాదం లేదు. అయితే భవిష్యత్తు పరిణామాలను పరిశీలిస్తూ ఉండాలి.

  • టీకాలు తీసుకున్నప్పటికీ ప్రజలు కొత్త రకం కరోనా వైరస్‌ల బారిన పడుతున్నారు. దీనికి పరిష్కారం ఏమిటి?

టీకా తీసుకోవడం, తప్పనిసరిగా మాస్కు ధరించడం, అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఎవరికివారు జాగ్రత్తలు తీసుకోవడమే దీనికి పరిష్కారం. టీకాల నుంచి నూరు శాతం రక్షణ లభించదు. కానీ ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న టీకాలతో ప్రాణాపాయం తప్పుతోంది. టీకా తీసుకున్న వారికి వ్యాధి సోకినా, దాని తీవ్రత తక్కువగా ఉంటుంది. ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం ఏర్పడటం లేదు.

  • ఈ మహమ్మారి ముప్పు పూర్తిగా ఎప్పటికి తొలగిపోతుంది?

ప్రస్తుతం దీనికి ఎవరూ సమాధానం చెప్పలేరు. కాలమే పరిష్కారం చూపుతుంది.

  • ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. దీన్నిబట్టి ఈ మహమ్మారి కథ ముగిసినట్లేనని అనుకోవచ్చా?

లేదు, లేదు.. ముప్పు తప్పిపోయిందని చెప్పలేం. దక్షిణాఫ్రికాలో అయితే ఈ ఏడాది మే నెలలో 5వ విడత కొవిడ్‌ ముప్పు ఎదురుకావచ్చని మేం అనుమానిస్తున్నాం. అది వస్తుందా, వస్తే ఎలా ఉంటుంది, ఎటువంటి వేరియంట్‌ అవుతుంది.. అనేది వేచి చూడాలి.

  • డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌ రకం ప్రమాదం ఎందుకు తక్కువ ఉంది? అదే సమయంలో శరవేగంగా ఎలా వ్యాపిస్తోంది?

దాని ఉత్పరివర్తనాల (మ్యుటేషన్‌) వల్ల ఒమిక్రాన్‌ రకం మానవ శరీరంలోని రోగ నిరోధక శక్తిని తప్పించుకోగలుగుతోంది. ఈ రకం వైరస్‌కు పునరుత్పత్తి (రిప్లికేషన్‌) కూడా ఎంతో అధికం. అందుకే వేగంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తిచెందుతోంది. ఒమిక్రాన్‌ రకం వైరస్‌ సోకిన వ్యక్తి నుంచి ఎంతో త్వరగా, సులువుగా కనీసం ముగ్గురు వ్యక్తులకు విస్తరిస్తోంది. అదే సమయంలో ఈ వైరస్‌ పెద్ద ప్రమాదకారి కాకపోవడానికి కారణాలు ఉన్నాయి. ఎక్కువ మందిలో ఈ వైరస్‌ శ్వాసకోశనాళం దిగువకు వెళ్లటం లేదు. అందువల్లే ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావడం లేదు. కృత్రిమ ఆక్సిజన్‌ అవసరం ఏర్పడటం లేదు. అందువల్ల ఇది తేలికపాటి వ్యాధిగా ఉండిపోయింది.

ఇదీచూడండి:AP corona cases: కొత్తగా 2,690 కరోనా కేసులు, 9 మరణాలు

ABOUT THE AUTHOR

...view details