'పండుటాకును చూసి... పసరాకు నవ్విందట' అన్న చందంగా తాము కూడా వృద్ధాప్యానికి చేరుతామన్న విషయాన్ని మరిచారు... 'పున్నామ నరకం నుంచి తప్పించువాడు కుమారుడు' అంటారు... కానీ కొందరు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు... పుట్టినప్పటి నుంచి పిల్లల భారాన్ని మోసిన తల్లిదండ్రులను... వృద్ధాప్యంలో భారమని భావిస్తున్నారు... తాజాగా తెలంగాణలోని కరీనంగర్ జిల్లాలో వృద్ధాప్యంలోని దంపతులకు ఇదే పరిస్థితి ఎదురైంది... అపురూపంగా చూసుకోవాల్సిన అమ్మానాన్నలను... రోడ్డుపై విసిరేశారు వారి కొడుకులు...
ఇదీ జరిగింది.... పిల్లలే సర్వస్వమని జీవించిన ఆ తల్లిదండ్రులు... చివరికి రోడ్డుపాలుకాక తప్పలేదు. తెలంగాణలోని కరీంనగర్ రూరల్ మండలం చెర్లబూత్కూర్ గ్రామానికి చెందిన అయిలయ్య, రావమ్మ ఇద్దరు దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. దాదాపు 90 ఏళ్ల వయసు వీరిది. అయిలయ్య తన ఆరు ఎకరాల భూమిని కుమారులకు పంచిపెట్టారు. ఇల్లు మూడో కుమారుడికి ఇస్తే, అతడు కొత్త ఇల్లు కట్టుకున్నాడు. పక్కనే తల్లిదండ్రులకు చిన్న రేకులషెడ్డు నిర్మించారు. కొన్నాళ్లకు అక్కడి నుంచి వెళ్లగొట్టడంతో ఆ దంపతులు చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని.. వృద్ధాప్య పింఛనుతో జీవించేవారు.