కట్టుకున్న భార్య, చేతికందొచ్చిన కుమారుడు, పదేళ్ల కుమార్తెతో హాయిగా జీవనం సాగుతోంది. చిన్న సెలూన్ షాపు పెట్టుకున్నా ఉన్నంతలో బాగానే బతుకుతున్నారు. విధి వక్రీకరించింది. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేసింది. వారి జీవితాల్ని అతలాకుతలం చేసింది. మహమ్మారి వ్యాప్తితో సెలూన్ మూతపడింది. లాక్డౌన్ సడలించినా.. కస్టమర్లు లేక వెలవెలబోయింది. కుటుంబ పోషణ రోజురోజుకి భారమయింది. భార్యాబిడ్డల్ని పోషించుకోవడానికి చేబదులు తీసుకోవడం మొదలుపెట్టాడు.
ఒక్కొక్కటిగా అవసరాలు పెరిగాయి. ఖర్చు పెరిగింది. చేతిలో చిల్లిగవ్వలేదు. రూపాయి సంపాదన లేదు. గతిలేక తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేయక తప్పలేదు. చేబదులుతో మొదలై.. లక్షల రూపాయలు అప్పులు చేయవలసిన పరిస్థితి వచ్చింది. అప్పులు తడిసిమోపడయ్యాయి. ఓవైపు కుటుంబ పోషణ భారం.. మరోవైపు అప్పులవాళ్ల సాధింపులు.. భరించలేకపోయాడు. లోలోపలే కుమిలిపోయాడు. ఊరంతా అప్పులు చేసి.. నలుగురి నోట్లో నానడం అవమానకరంగా భావించాడు. తీవ్రమనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అటు అప్పులు... ఇటు జులాయిగా మారిన కుమారుడు
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటకు చెందిన లింగిశెట్టి నీలాచలం సెలూన్ షాపు నడుపుతూ కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా వల్ల షాపు తెరవకపోవడం.. కుటుంబ పోషణ భారమవ్వడం.. అప్పులు చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. చేతికందొచ్చిన 16 ఏళ్ల కుమారుడు.. కాస్తంతైనా సాయపడతాడునుకుంటే.. పోకిరిగా తిరగడం జీర్ణించుకోలేకపోయాడు. పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు చెప్పినా.. తండ్రికే ఎదురుతిరిగాడు. చేసేదేం లేక రెండ్రోజుల క్రితం స్థానిక పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి పోలీసులతో కౌన్సిలింగ్ ఇప్పించాడు. అయినా తీరు మారలేదు.