విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి వెండి రథంలోని సింహాలను భాజపా నేతల బృందం పరిశీలించింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. దుర్గ గుడి వద్ద ఉన్న రథానికి అత్యధిక ప్రాధాన్యత ఉందన్నారు. అలాంటి రథానికి తగిన భద్రత ఉండాలని తెలిపారు. రథం ఖరీదు సుమారు రూ. 15లక్షలు ఉంటుందని ఈవో చెప్పారని వెల్లడించారు. నాలుగు సింహాల్లో ఒక్క సింహం ప్రతిమే ఉండటాన్ని గమనించామని చెప్పారు.
ప్రతిమలు లాకర్ లో ఉన్నాయని చెప్పేందుకు ఈవో ప్రయత్నించారని... కానీ పరిస్థితిని చూస్తే వాటిని ధ్వంసం చేసినట్లు కనిపిస్తోందని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ఆలయ అధికారుల నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఘటనకు సంబంధించి రెండు రోజుల్లో నివేదికను ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.