ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'రాష్ట్ర వైద్య వసతులపై నమ్మకంలేకనే... వైకాపా నేతలు ఇతర రాష్ట్రాల్లో చికిత్స ' - ఏపీ తాజా వార్తలు

కరోనా నివారణలో మొదట్నుంచి వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కరోనా కేసులు పెరుగుతున్నా కనీస వైద్య సదుపాయాలు అందుబాటులో లేవన్నారు. రాష్ట్రంలో వైద్య సేవలపై నమ్మకంలేకనే వైకాపా నేతలు ఇతర రాష్ట్రాల్లో చికిత్స చేయించుకుంటున్నారన్నారు. కరోనా కట్టడికి కేంద్రం ఇచ్చిన రూ.8 వేల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారో ప్రభుత్వం ప్రజలకు చెప్పాలన్నారు.

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

By

Published : Jul 22, 2020, 11:09 PM IST

కరోనా వ్యాధిని రాష్ట్ర ప్రభుత్వం మొదట నుంచి తేలికగా తీసుకోవటం వల్ల, ఇప్పుడు మరింత ప్రమాదకరంగా మారి ఆస్పత్రుల్లో బెడ్లు లేని పరిస్థితి నెలకొందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితి చేయి దాటిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం వేలాది కేసులు నమోదవుతుండటంతో దేశంలోనే ఏపీ 5వ స్థానానికి చేరిందని ఆవేదన చెందారు. ఆంధ్రప్రదేశ్ లో ఆస్పత్రులు, వాటిలోని వసతులపై నమ్మకం లేకనే ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, ఎంపీ విజయసాయిరెడ్డి హైదరాబాద్ లో, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చెన్నై ఆస్పత్రుల్లో చేరారని విమర్శించారు.

ముఖ్య నాయకులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలే రాష్ట్రాన్ని వదిలి పొరుగు రాష్ట్రాలకు వెళుతున్నారంటే ఏపీలో పరిస్థితి అర్థమవుతుందని ధ్వజమెత్తారు. కరోనా నివారణకు రూ.8 వేల కోట్లు ఇచ్చామని కేంద్రం చెబుతుంటే... ఈ మొత్తం ఎక్కడ ఖర్చు పెట్టారని ప్రజల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. కరోనా కారణంగా ప్రజలు ఆకలితో అలమటించే రోజులొచ్చాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేద్దామన్నా పనులు లేవని, ఆహార కొరత కూడా ఏర్పడే ప్రమాదం నెలకొందని గుర్తు చేశారు. ఇలాంటి సమయంలో కేంద్రం ఇచ్చిన నిధులకు రెండింతలు సమకూర్చి ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని సూచించారు.

ఇదీ చదవండి :'గోడౌన్​లో గుట్కా: ఆ వైకాపా ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు పెట్టాలి'

ABOUT THE AUTHOR

...view details