ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Govt teachers efforts: పిల్లల ఇళ్లకే ప్రభుత్వ టీచర్లు.. విద్యా బోధనలో ఉత్తమ సేవలు..! - online teaching

కరోనా సమయంలోనూ కొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇళ్ల వద్దకు వెళ్లి బోధన చేస్తున్నారు. యూట్యూబ్‌ ఛానళ్లు, వాట్సప్‌ గ్రూపులతో పిల్లలకు పాఠ్యాంశాలు చెబుతూ నిత్యం వారితో మమేకమవుతున్నారు. కరోనా సమయంలోనూ పిల్లలకు విద్యను అందిచేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయులు అహర్నిశలు కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

teaching students in homes
ఇళ్ల వద్దకు వెళ్లి బోధన

By

Published : Jul 22, 2021, 7:33 AM IST

Updated : Jul 22, 2021, 3:17 PM IST

కరోనాతో ఇంటికే పరిమితమైన పిల్లల అభ్యసనకు ఆటంకం కలగకుండా కొందరు ఉపాధ్యాయులు ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. యూట్యూబ్‌ ఛానళ్లు, వాట్సప్‌ గ్రూపులతో పాఠాలను అందించడమే కాకుండా నేరుగా పిల్లల ఇళ్లకే వెళ్లి బోధిస్తున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా పంపించిన పాఠాలను ఎంతవరకు అర్థం చేసుకున్నారు? అభ్యసన ఎలా ఉందో పరిశీలించి ఇంటి వద్దనే సందేహాలను తీర్చుతున్నారు. చీకట్లను పారదోలే వెలుగుదివ్వెలుగా వారు ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.

ఇంటి వద్దకే మాస్టర్‌..

విద్యార్థులు చదువులో వెనకబడకుండా తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం శ్రీరామనగర్‌ కాలనీ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శిష్ట చలపతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. కరోనా సమయంలోనూ పిల్లల ఇళ్లకు వెళ్లి సందేహాలను తీర్చడంతో పాటు వర్క్‌ పూర్తి చేశారో లేదో తెలుసుకుంటున్నారు. సాధారణంగా జూన్‌ 12నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈసారి ఆలస్యమవుతున్నప్పటికీ, అప్పటినుంచే ఉపాధ్యాయుడు చలపతి పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.

పాఠశాలలో 115మంది విద్యార్థులున్నారు. వారిలో 10మందికి స్మార్ట్‌ఫోన్లు లేవు. మిగతా 105 మందితో వాట్సప్‌ గ్రూపు ఏర్పాటుచేసి ప్రతిరోజు క్రమం తప్పకుండా పాఠాలను పంపిస్తున్నారు. ఫోన్లు లేని పిల్లలు ఫోన్‌ ఉన్నవారి ఇంటికెళ్లి పాఠాలు రాసుకునేలా ఏర్పాట్లు చేశారు. వారంలో 3 రోజులు పిల్లల ఇళ్లకు వెళతారు. గతేడాది నేర్చుకున్న పాఠ్యాంశాలను పునశ్చరణ చేయిస్తున్నారు. చురుగ్గా స్పందించే పిల్లలకు చిన్నచిన్న బహుమతులు అందిస్తారు. 2019-20లో ఒక్క సెలవు కూడా పెట్టకుండా పాఠశాలకు హాజరయ్యారు. పిల్లల కోసం యూట్యూబ్‌ ఛానల్‌నూ నిర్వహిస్తున్నారు.

ఖాళీ ప్రదేశమే బడి...

పిల్లల అభ్యసనకు ఆటంకం కలగకూడదని కరోనా సమయంలోనూ గ్రామాలకు వెళ్లి పాఠాలు చెబుతున్నారు చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం గూడూరుపల్లి ఉపాధ్యాయురాలు సుశీల. ఈ గ్రామ పాఠశాలకు అగ్రహారం, గూడూరుపల్లి, నక్కబండ నుంచి విద్యార్థులు వస్తారు. పాఠశాలలో మొత్తం 87మంది వరకు పిల్లలున్నారు. ఉపాధ్యాయులు రోజు విడిచి రోజు బడికి రావాలని విద్యాశాఖ ఆదేశాలను పాటిస్తూనే ఖాళీ రోజుల్లో గ్రామాల్లో విద్యార్థుల ఇళ్లకెళ్లి బోధిస్తున్నారు. గ్రామానికి వెళ్లిన సమయంలో ఖాళీ ప్రదేశంలో విద్యార్థులను దూరందూరంగా కూర్చోబెట్టి బోధిస్తారు. ఒక్కో రోజు ఒక్కో గ్రామానికి వెళ్లి వస్తారు. చిన్నారుల కోసం ‘మా చిన్నారుల వేసవి బడి’ వాట్సప్‌ గ్రూపు, యూట్యూబ్‌ ఛానల్‌నూ నిర్వహిస్తున్నారు.

విద్యార్థి నాయకుల ద్వారా వర్క్‌షీట్లు

పిల్లల బోధనపై గుంటూరు జిల్లా బాపట్ల మండలం అసోదివారిపాలెం మండల పరిషత్‌ పాఠశాల ఉపాధ్యాయురాలు సౌజన్య నిర్వహిస్తున్న ఫేస్‌బుక్‌కు 5లక్షల మంది వరకు వీక్షకులున్నారు. ఫోన్లు లేని పిల్లల కోసం ప్రత్యేకంగా వర్క్‌షీట్లను రూపొందిస్తున్నారు. విద్యార్థుల్లోనే ఒకరిద్దరిని నాయకులుగా పెట్టి వారితో అందరికీ వర్క్‌షీట్లు అందేలా చూస్తున్నారు. విద్యార్థుల అభ్యసనను తెలుసుకునేందుకు వారి ఇళ్లకే వెళ్తున్నారు. పిల్లలకు వచ్చే సందేహాలను నివృత్తి చేసి, బడిలో నేర్చుకున్న అంశాలను మర్చిపోకుండా ఉండేందుకు ప్రాథమిక అంశాలను గుర్తు చేస్తున్నారు. కొన్నిసార్లు గ్రామ రామాలయం వద్దనే పిల్లలను దూరందూరంగా కూర్చోబెట్టి నోటు పుస్తకాలతో బోధిస్తున్నారు. 25మంది పిల్లల అభ్యసనను ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నారు.

యూట్యూబ్‌తో అమ్మభాష..

యూట్యూబ్‌ వీడియోలతో అమ్మభాషను విద్యార్థులకు చేరువ చేస్తున్నారు కడప జిల్లా ప్రొద్దుటూరు ఎద్దుల వెంకటసుబ్బమ్మ పురపాలక బాలికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గంగాధరనాయుడు. ఆయన యూట్యూబ్‌ వీడియోలకు 8.76 లక్షల మంది వీక్షకులున్నారు. పదో తరగతి తెలుగు సబ్జెక్టును విద్యార్థులకు యూట్యూబ్‌, ఆన్‌లైన్‌లో అందిస్తున్నారు. పురపాలకశాఖ జూమ్‌ తరగతులు ప్రారంభించకముందే యూట్యూబ్‌ ద్వారా విద్యార్థులకు ప్రతి రోజు తెలుగు పాఠాలను బోధించారు. విద్యార్థులకు ఉపయోగపడేలా తెలుగు వ్యాకరణాన్ని రూపొందించారు.

ఇదీ చదవండి:

Rains effect in AP cities: వానొస్తే వణుకే.. రాష్ట్రంలోని అత్యధిక నగరాల్లో ఇదే పరిస్థితి!

Viral video: నదిలో కొట్టుకుపోయిన తాగుబోతు!

Last Updated : Jul 22, 2021, 3:17 PM IST

ABOUT THE AUTHOR

...view details