రాష్ట్రంలో 2024 నుంచి ఏటా 3 వేల మెగావాట్ల చొప్పున మూడేళ్లలో మొత్తం 9 వేల మెగావాట్ల సామర్థ్యం ఉన్న సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకోవడానికి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ) ఆసక్తి వ్యక్తంచేసింది. వీటి ఏర్పాటుతో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్‌కు సెకీ జనరల్ మేనేజర్ అతుల్యకుమార్ నాయక్ లేఖ రాశారు. ఇందులో ‘పునరుత్పాదక ఇంధన వనరులను ప్రోత్సహించటంలో రాష్ట్ర ప్రభుత్వం చూపుతున్న చొరవ అభినందనీయం. వ్యవసాయానికి పగలే విద్యుత్ అందించే చర్యలను ప్రభుత్వం చేపట్టింది. ఇది డిస్కంలపై భారం పడదు, రైతులకూ మేలు కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 6,400 మెగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు టెండర్లను పిలిచింది. ఇందులో కొందరు యూనిట్ రూ.2.49 వంతున సరఫరా చేయటానికి బిడ్ దాఖలు చేశారు’ అని లేఖలో పేర్కొంది.
* కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించటానికి సౌర విద్యుత్ టెండర్లను 2019 నవంబరులో నిర్వహించింది. నాలుగు దశల్లో.. ఏటా 3 గిగావాట్ల సౌరవిద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు కేంద్రం నుంచి సెకీ అనుమతి పొందింది. ఈ ప్రాజెక్టులకు అంతర్రాష్ట్ర సరఫరా ఛార్జీలను కేంద్రం మినహాయించింది. మొదటిదశలో ఏర్పాటుచేసిన ప్రాజెక్టులు 2023 సెప్టెంబరు నాటికి ఉత్పత్తిలోకి వచ్చే అవకాశం ఉంది. మిగిలిన మూడు దశల్లో ప్రతిపాదించిన ప్రాజెక్టులు 2024, 25, 26లో అందుబాటులోకి వస్తాయి. టెండరు నిబంధన ప్రకారం దేశంలో ఏటా 3 గిగావాట్ల సౌర విద్యుత్ పరికరాల తయారీ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టును ఏర్పాటుచేయాలి.
* మూడు దశల్లో ఏడాదికి 3 మెగావాట్ల వంతున.. 9 వేల మెగావాట్ల ప్రాజెక్టులు ఏర్పాటుకు అవకాశం ఉంది. సెకీ నుంచి లెటర్ ఆఫ్ అవార్డు (ఎల్‌వోఏ) పొందిన సంస్థలు వాటిని ఏర్పాటు చేస్తాయి. ఈ పథకం కింద ఏర్పాటు చేసిన ప్రాజెక్టుల నుంచి సెకీ వాణిజ్య లాభాలతో కలిపి యూనిట్‌ను రూ.2.49కే సరఫరా చేస్తుంది.
ఉత్పత్తి ఆధారిత విద్యుత్ సరఫరా ఒప్పందాలు (పీఎస్‌ఏ) వల్ల ప్రయోజనాలు