Software employee suicide in hanamkonda: భార్య, అత్తమామ వేధింపులతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ జిల్లా శాయంపేట మండలం రాజుపల్లిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కొండా రాకేష్(28) హైదరాబాద్‌లోని హెచ్‌సీఎల్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. ఫిబ్రవరిలో వరంగల్ జిల్లా సంగెం మండలం ఎలుకుర్తిహవేలికి చెందిన దేవులపల్లి నిహారిక(24)తో వివాహమైంది. కొద్ది నెలల పాటు సజావుగా సాగిన వీరి కాపురంలో వర్క్ ఫ్రం హోం చిచ్చుపెట్టింది.
కాపురంలో చిచ్చుపెట్టిన వర్క్ ఫ్రం హోం, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య - HCL employee suicide
Software employee suicide in hanamkonda కరోనా పుణ్యామా అని ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం దొరికింది. అయితే ఇది కొందరికి సౌలభ్యం కాగా, మరికొందరికి మాత్రం చాలా ఇబ్బందులు తెచ్చిపెట్టింది. కొత్తగా పెళ్లయిన జంటకు వర్క్ ఫ్రం హోం కలిసొచ్చే అంశం. అయితే ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఆ కొత్త కాపురంలో చిచ్చు పెట్టింది. ఇద్దరి మధ్య దూరం పెంచటమే కాకుండా, ఒకరి ప్రాణాలు తీసుకునేందుకు కారణమైంది.
భార్య నిహారికకు పల్లెటూరులో ఉండటం ఇష్టంలేక హైదరాబాద్‌కు వెళ్దామని భర్తతో చెప్పగా వర్క్‌ఫ్రంహోం పూర్తికాగానే వెళ్దామని సర్ధిచెప్పాడు. ఈ విషయంలో ఇద్దరికి మనస్పర్థలు వచ్చాయి. ఇంకేముంది భర్త మీద అలిగి నిహారిక పుట్టింటికి వెళ్లిపోయింది. అందులోనూ నిహారిక అయిదు నెలల గర్భవతి. భార్యకు సర్ధిచెప్పేందుకు రాకేష్ తనవంతుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య అనుకోకుండానే దూరం పెరిగిపోయింది
కొద్ది రోజుల కిందట వీడియోకాల్ చేసి భర్త రాకేష్‌ను చనిపోవాలని.. అప్పుడే తాను మరొకరిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ మాట రాకేష్‌ను చాలా బాధపెట్టింది. పైగా.. తరచూ అత్తామామలు సూటిపోటి మాటలు అనడంతో తీవ్ర మనస్తాపం చెందాడు. తనకు ఎదురవుతోన్న పరిణామాలతో కుంగిపోయిన రాకేష్.. సూసైడ్ నోట్ రాసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని.. మృతుడి భార్యతో పాటు అత్త అరుణ, మామ శంకర్‌పై కేసు నమోదు చేశారు.