రాష్ట్రంలో తలసరి ఆదాయం గణనీయంగా పెరిగిందని 2019- 20 సామాజిక, ఆర్థిక సర్వేలో ప్రణాళిక విభాగం వెల్లడించింది. రాష్ట్రంలో ప్రస్తుతం తలసరి ఆదాయం 1,69,519 రూపాయలుగా ఉన్నట్లు పేర్కొంది. 2019- 20 సామాజిక, ఆర్థిక సర్వేను ముఖ్యమంత్రి జగన్ విడుదల చేశారు. సీఎం క్యాంపు కార్యాలయం ఈ కార్యక్రమానికి వేదికైంది.
విద్య, వైద్యం, రైతులు, పేదల సంక్షేమాన్ని సర్వేలో ప్రాధాన్యతాంశాలుగా పేర్కొన్నారు. 2019- 20కి రాష్ట్ర స్థూల ఉత్పత్తి(జీఎస్డీపీ) 9,72,782 కోట్ల రూపాయలుగా సర్వేలో వెల్లడించారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే జీఎస్‌డీపీలో 12.73 శాతం వృద్ధి ఉంటుందని సర్వే నివేదిక పేర్కొంది. మొత్తంగా రాష్ట్ర జీఎస్డీపీ వృద్ధి 8.16గా ఉందని ప్రణాళిక విభాగం తెలిపింది. 2018- 19తో పోలిస్తే 1,10,000 కోట్ల పెరుగుదల ఉందని నివేదించింది.