తెలంగాణలో లాక్‌డౌన్ ఆరంభమైన నాటి నుంచి తగ్గుతూ వచ్చిన గృహహింస ఉదంతాలు.. మద్యం దుకాణాలు తెరవడంతో ఒక్కసారిగా విజృంభించినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డయల్-100కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా మహిళా భద్రత విభాగం చేసిన విశ్లేషణ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో మద్యం విక్రయాలకు అనుమతులిచ్చిన నాటి నుంచి గృహహింస ఫిర్యాదులు అమాంతం పెరిగిపోయాయి.
లాక్‌డౌన్ ఆరంభమైన నాటి నుంచి మే మొదటి వారం వరకు సుమారు 45 రోజుల పాటు ఇలాంటి ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయి. అంతకుముందుతో పోల్చితే ఇలాంటి కేసులు దాదాపు సగం కంటే ఎక్కువగా తగ్గడం గమనార్హం. మునుపు సాధారణంగా రోజుకు 400 వరకు ఫిర్యాదులొచ్చేవి. లాక్‌డౌన్ తర్వాత ఈ సంఖ్య 200 లోపునకే పరిమితమైంది. చాలా రోజులు 100-150 లోపే నమోదయ్యాయి. ఎప్పుడైతే మద్యం విక్రయాలు మొదలయ్యాయో అప్పటినుంచి మళ్లీ బాధితురాళ్లు డయల్-100కు ఫోన్ చేయడం విపరీతంగా పెరిగింది.
ఏడో తేదీ ఆల్‌టైం రికార్డు
తెలంగాణలో లాక్‌డౌన్ కొనసాగుతున్నా సడలింపుల నేపథ్యంలో మే నెల 6 నుంచి మద్యం విక్రయాలకు అనుమతిచ్చారు. తొలిరోజు ఏకంగా రూ.100కోట్ల వరకు అమ్మకాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. అంతకుముందు రోజు డయల్-100కు 127గా ఉన్న గృహహింస ఫిర్యాదుల సంఖ్య ఆ రోజు 370గా నమోదైంది. దాదాపు మూడింతలు పెరిగింది. ఆ మరునాడు ఏకంగా 512 మంది బాధితురాళ్లు ఫిర్యాదు చేశారు. డయల్-100కు వచ్చిన గృహహింస ఫిర్యాదుల్లో ఇది ఆల్‌టైం రికార్డు. అప్పటి నుంచీ 300లకు తగ్గకుండా ఫిర్యాదులు నమోదవుతూనే ఉన్నాయి. ఓవైపు మద్యం దుకాణాలు తెరిచిన రెండుమూడు రోజుల తర్వాత నుంచి విక్రయాలు పడిపోయినా గృహహింస ఫిర్యాదులు తగ్గకపోవడం గమనార్హం. పూర్తిస్థాయిలో పనుల్లేక, చేతిలో డబ్బుల్లేక, మద్యం కొనేందుకు సొమ్ముల కోసం ఇళ్లల్లో గొడవలు జరిగి గృహహింస ఫిర్యాదులకు దారితీస్తున్నాయని పోలీసులు విశ్లేషిస్తున్నారు.
- ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో పనిచేసే దంపతులు వారు. బాచుపల్లిలో ఉంటారు. విదేశాల నుంచి వచ్చిన అతను సహోద్యోగినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికిద్దరు పిల్లలు. అతనికి తాగుడు అలవాటుంది. లాక్‌డౌన్ సమయంలో ఇంటి పని విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి. అతను మద్యం తాగినపుడు భార్యాభర్తల నడుమ ఘర్షణ తలెత్తేది. కొద్ది రోజుల క్రితం డయల్-100కు ఫిర్యాదు చేయగా బాచుపల్లి ఠాణా పోలీసులు వెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు.
- వనస్థలిపురం ప్రాంతానికి చెందిన ఆటోడ్రైవర్ నిత్యం తాగి ఇల్లు చేరతాడు. ఇల్లు గడిచేందుకు సరిపడా డబ్బులివ్వడం లేదంటూ అతని భార్య తరచూ పోరు పెట్టేది. ఆమె కొన్ని ఇళ్లల్లో చేసే పనితో కొంత డబ్బు కూడబెట్టేది. లాక్‌డౌన్ కారణంగా ఆటోలు నడవక ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. మద్యం దుకాణాలు తెరిచాక కూడా ఆటోలు నడవకపోవడంతో తాగేందుకు డబ్బివ్వాలని భార్యను సతాయించేవాడు. వారం క్రితం భార్యతో గొడవ పడి ఆమెవద్ద కొద్ది సొమ్ము లాక్కెళ్లాడు. బాధితురాలు 100 నంబర్‌కు ఫోన్ చేయడంతో కౌన్సెలింగ్ ఇవ్వాల్సి వచ్చింది.
ఇవీ చూడండి:రాష్ట్రంలో మరో 199 కరోనా పాజిటివ్ కేసులు... ఐదుగురు మృతి