ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కరోనా సమయంలో చిరు ధాన్యాలతో వంటలు - Dishes with snacks during Corona

మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా చిరుధాన్యాల ప్రాముఖ్యం పెరుగుతోంది. ప్రజలు సంప్రదాయ ఆహారం, జంక్‌ఫుడ్‌ వదిలి... చిరుధాన్యాలతో చేసిన ఆహారపదార్థల పట్ల ఆసక్తి కనబరుస్తున్నారు. కరోనా నేపథ్యంలో చిరుధాన్యాలతో చేసిన అల్పాహారం, చిరుతిండ్లకు మార్కెట్‌లో డిమాండ్‌ పెరుగుతోంది. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి కల్పించడంతో పాటు ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడమే ధ్యేయంగా... తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా డీఆర్​డీఏ మదనాపురం కృషి విజ్ఞాన కేంద్రం కలిసి పనిచేస్తున్నాయి. శిక్షణ పొందిన మహిళలు త్వరలో ఉత్పత్తులను ప్రారంభించనున్నారు.

caronatime snacks
కరోనా సమయంలో చిరు ధాన్యాలతో వంటలు

By

Published : Jul 6, 2020, 7:32 PM IST

కరోనా సమయంలో చిరు ధాన్యాలతో వంటలు

నాడు పూర్వీకులు ఆహారంగా తీసుకున్న చిరుధాన్యాలకు ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. మధుమేహం, గుండెజబ్బులు రాకుండా ఉండేందుకు, ఆరోగ్య పరిరక్షణకు చిరుధాన్యాలను ఆహారంగా తీసుకోవాలన్న అవగాహన ప్రజల్లో క్రమంగా పెరుగుతోంది. అందులో భాగంగా వీటితో చేసిన ఆహార పదార్థాల వైపు ప్రజలు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ డిమాండ్‌ను అందిపుచ్చుకోవడంతో పాటు మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో... తెలంగాణ రాష్ట్రం వనపర్తి జిల్లా మదనాపురంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో... చిరుధాన్యాలతో ఆహార ఉత్పత్తుల తయారీపై వారికి శిక్షణ అందించారు.

చిరు ధాన్యాలతో..

కృషి విజ్ఞానకేంద్రం దత్తత గ్రామం శ్రీరంగాపురం మండలం వెంకటాయపాలెం గ్రామానికి చెందిన మహిళలకు... తొలిదశ శిక్షణ ఇచ్చారు. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు సహా ఇతర చిరుధాన్యాలతో బిస్కెట్లు, మురుకులు, చక్కీలు, లడ్డులు సహా సుమారు 20కి పైగా రకాల చిరుతిండ్లను తయారు చేయడంలో తర్ఫీదు ఇచ్చారు. ధాన్యాన్ని రవ్వగా, పిండిగా మార్చి అమ్మడం వంటి ఫుడ్ ప్రాసెసింగ్ ప్రక్రియలను సైతం నేర్పించారు. ఈ శిక్షణ తమ ఆరోగ్య సంరక్షణతో పాటు స్వయం ఉపాధికి సైతం ఎంతగానో దోహదం చేస్తుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ప్రతి అంశంపైనా...

చిరుధాన్యాలతో తయారు చేసిన ఆహార ఉత్పత్తులు మార్కెట్‌లో అమ్ముకునేందుకు ఉన్న అవకాశాలపై కేవీకే సంస్థ ప్రతినిధులు అవగాహన కల్పించారు. చిరుధాన్యాలు పండించే ప్రాంతం, వాటిని ఆహారంగా వినియోగించే ప్రదేశాల్లోని మహిళలనే శిక్షణ కోసం ఎంపిక చేశారు. రాగులు, సజ్జలు, జొన్నలు కావల్సినంత అందుబాటులో ఉన్నా... అన్నిరకాల ఉత్పత్తులను జనం కొనుగోలు చేయడం లేదు. అందువల్లే ఎక్కువమంది చిరుతిండిగా తీసుకునే... లడ్డూలు, మురుకులు, చక్కీలు, కేకులు, రవ్వను చిరుధాన్యాలతో చేసే విధానాన్ని మహిళలకు నేర్పించారు. వినియోగదారులను ఆకర్షించేందుకు వాటి ఆకారం, పరిమాణం, ప్యాకింగ్‌ పైనా అవగాహన కల్పించారు.

మరిన్ని ప్రణాళికలు...

ఎస్సీ, ఎస్టీ సబ్‌ ప్లాన్ కింద డీఆర్‌డీఏ ఈ శిక్షణకు సహకారం అందిస్తోంది. శిక్షణతో పాటు ఉత్పత్తులకు అవసరమైన పరికరాలను అందజేస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల్లో ఈ తరహాలో మహిళలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు రచిస్తోంది.

ప్రస్తుతం ఐదు రోజుల శిక్షణను పూర్తి చేసుకున్న మహిళ బృందాలకు... త్వరలోనే ఉత్పత్తులకు కావల్సిన పరికరాల్ని అందించనున్నారు. మహిళ సంఘాల ద్వారానే యూనిట్లను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

ఇవీ చూడండి:

శుభవార్త: ఒక్కో రైతుకు నేరుగా రూ.1.60 లక్షలు!

ABOUT THE AUTHOR

...view details